solar plant : బెల్లంపల్లిలో సౌర వెలుగులు.. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు..

by Sumithra |   ( Updated:2024-10-26 01:49:12.0  )
solar plant : బెల్లంపల్లిలో సౌర వెలుగులు.. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు..
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలో సౌర వెలుగులు (solar plant ) ప్రసరించనున్నాయి. సింగరేణి (Singareni)ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం భూమి చదును పనులు కొనసాగుతున్నాయి. 200 మెగావాట్ల (200 MW ) సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్ ఎదురుగా పాత మాగ్జిన్ స్థలంలో ఈ ప్లాంట్ స్థాపనకు నిర్ణయించారు. ఈ మేరకు 50 ఎకరాలకు పైగా ఉన్న సింగరేణి ఖాళీ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఎక్స్కవేటర్లు, క్రేన్లతో భూమిని చదును చేస్తున్నారు. కూలీలను నియమించి చెట్లను తొలగిస్తున్నారు. ఎత్తు వంపులుగా నేలను సమానం చేస్తున్నారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అధికారులు సౌర విద్యుత్ ప్లాంటుకు ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్లాంట్ నిర్వహణ కాంట్రాక్టర్ పనులను అత్యంత వేగంగా చేయిస్తున్నారు.

బెల్లంపల్లికి మహర్దశ..

బొగ్గు గనులు మూతబడిపోయి, డిపార్ట్మెంట్లు ఎత్తివేతతో ఉనికిని కోల్పోయిన బెల్లంపల్లికి రానున్న సోలార్ ప్రాజెక్టుతో బెల్లంపల్లి భవిష్యత్తుకు భరోసా అని స్థానికులు భావిస్తున్నారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికే జైపూర్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పారు. ఈ నేపథ్యంలో సింగరేణి హాయంలో మరో ప్రాజెక్టుకు యాజమాన్యం సంకల్పించింది. అందుకు బెల్లంపల్లిని వేదిక చేసుకోవడం పట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. పారిశ్రామికంగా అడుగంటిన బెల్లంపల్లిలో సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుతో బెల్లంపల్లికి పూర్వ వైభవానికి దారి సుగుమమం పై ఆశలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ కార్యక్రమంలో భాగంగా యాజమాన్యం విద్యుత్ ప్రాజెక్టులకు నాంది పలుకుతోంది. బొగ్గు ప్రాజెక్టులే కాకుండా బొగ్గు ఆధారిత పరిశ్రమల వైపుగా సింగరేణి యాజమాన్యం అడుగులు వేస్తోంది. పారిశ్రామిక పురోభివృద్ది కోసం కొత్త పుంతలు తొక్కుతోంది. బెల్లంపల్లి కేంద్రంగా నూతనంగా తలపెట్టిన సోలార్ విద్యుత్తు ప్రాజెక్ట్ తో కరెంటు బాధలు పూర్తిగా తొలిగిపోనున్నాయి.

సింగరేణి యాజమాన్యం తమ పట్టణాలకు సొంతంగా విద్యుత్తు సరఫరాకు స్వయం ప్రతిపత్తి విద్యుత్ సంస్థలు ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తోంది. అన్ని రంగాల్లో కంపెనీ అభివృద్ధిలో మరింతగా దూసుకుపోవడానికి యజమాన్యం మహత్తర మైన భూమిక పోషిస్తున్నది. బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా విభిన్నరంగాల్లో కూడా సింగరేణి రాణించడానికి చేపడుతున్న ప్రణాళికల్లో భాగమే నూతన ప్రాజెక్ట్ లని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సింగరేణీయుల అవసరాలు, సంక్షేమం కంపెనీ అభివృద్దే లక్ష్యంగా మరిన్ని ప్రాజెక్టులు రావాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. ఉపాధి, సంక్షేమ రంగాల్లో సింగరేణి కంపెనీ మరింతగా ముందుకెళ్లాలని స్థానికులు ఆశిస్తున్నారు. త్వరలోనే సోలార్ ప్రాజెక్ట్ పనులకు భూమి పూజ ముహూర్తం కానుంది. అందుకోసం అత్యంత వేగంగా సన్నాహకపనులు జోరుగా సాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed