రూ.1000 కోట్ల అమోయ్.. కొత్త కంప్లైంట్ తో బిగుస్తోన్న ఉచ్చు

by Y.Nagarani |   ( Updated:2024-10-26 02:19:11.0  )
రూ.1000 కోట్ల అమోయ్.. కొత్త కంప్లైంట్ తో బిగుస్తోన్న ఉచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈడీ ఎంక్వైరీతో ఇబ్బందులు పడుతున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై మరో కంప్లయింట్ వచ్చింది. సుమారు రూ.వెయ్యి కోట్లు విలువ చేసే 800 ప్లాట్ల స్థలానికి రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి పాసు పుస్తకాలు జారీ చేశారని ఈడీ జాయింట్ డైరెక్టర్ కి శుక్రవారం మధురానగర్ ప్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు కాపీతో పాటు పహానీలు, స్పెషల్ ట్రిబ్యునరల్ ఆర్డర్ కాపీలు, రిట్ పిటిషన్ 3633/2023 ఇంటెరిమ్ స్టే ఆర్డర్, లే అవుట్ కాపీలు, జీపీఏలు, కొన్ని సేల్ డీడ్స్ కాపీలను ఈడీకి సమర్పించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టిఅన్నారం సర్వే నం.108 నుంచి 111 వరకు రెవెన్యూ రికార్డులు అప్ డేట్ చేసేటప్పుడు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని రాతపూర్వకంగా రాసిచ్చినా పట్టించుకోలేదని సంఘం అధ్యక్షులు ఎం. రామ్మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సర్వే నంబర్లలోని 70.39 ఎకరాల భూమి ఏనాడో సేల్ డీడ్స్ అయిపోయిందని స్పష్టం చేశారు. ఐనా బడా కంపెనీల పేరిట రికార్డులను అప్ డేట్ చేశారని ఆరోపించారు.

అమ్మేసిన భూమిపై పేచీ

తట్టి అన్నారంలో సర్వే నం.108, 109, 110, 111 లో మొత్తం 70.39 ఎకరాల భూమి మద్ది సత్యనారాయణరెడ్డి పేరిట ఉండేది. ఆయన పట్టాదారు అని ఖాస్రా పహాణీ నుంచి రికార్డుల్లో ఉన్నది. ఆయన, ఆయన సోదరుడు బాల్ రెడ్డి కలిసి 1980 లో ఎమ్వీ రంగాచారికి ఆ భూమిని జీపీఏ చేశారు. 1978 లోనే లే అవుట్ చేసి గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. అప్పట్లో భాగ్యలక్ష్మీ నగర్ కాలనీగా పేరు పెట్టారు. జీపీఏ ఇచ్చిన తర్వాత 1981 నుంచి ప్లాట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. ఆ కాలంలోనే రాధాకృష్ణ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 160 ప్లాట్లు చేశారు. 1981లో డాక్యుమెంట్ నం.840 నుంచి 844, 1982 లో డాక్యుమెంట్ నం.631, 664 లతో అమ్మేశారు. జీపీఏ హోల్డర్ 840 ప్లాట్లను అమ్మేశారు. లే అవుట్లలోని పూర్తి ప్లాట్లను అమ్మేశారని కొనుగోలుదారులు చెబుతున్నారు. 2004 వరకు రెవెన్యూ రికార్డుల్లోని కబ్జా కాలమ్ లో ప్లాట్లు అని నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులను మద్ది భాగ్యమ్మ, మద్ది శ్రీకాంత్ రెడ్డి తదితరుల పేరిట మార్చారు. దీంతో ఈ ప్లాట్ల యజమానులంతా కలిసి మధురా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. భూమి నేచర్ ఆఫ్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్, ప్లాట్లుగా రాయాలని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాగిడి లక్ష్మారెడ్డి 2022 సెప్టెంబరు 18న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కి లిఖితపూర్వకంగా కోరారు.

రికార్డుల్లో మద్ది ఫ్యామిలీ

తట్టిఅన్నారం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.108 లో 18.23 ఎకరాలు, 109 లోని 21.22 ఎకరాలు, 110 లోని 19.15 ఎకరాలు, 111లోని 11.19 ఎకరాలు .. మొత్తం 73.30 ఎకరాలు పట్టా భూమి అని చెస్సాలా 1955–58 లో స్పష్టంగా ఉంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నాయి. అదంతా మద్ది సత్యనారాయణరెడ్డిదిగా ధ్రువీకరించారు. ఆ తర్వాత వారి వారసులుగా మద్ది భాగ్యమ్మ, వెంకటమ్మ (జ్యోతి), మద్ది శ్రీకాంత్ రెడ్డిలను గుర్తించి సక్సెషన్ చేస్తూ 1998లో ఉత్తర్వులు జారీ చేశారు. 1950లో జమాబందీలో ప్రభుత్వానికి రూ.394 చెల్లించడం ద్వారానే మద్ది సత్యనారాయణరెడ్డికి సంక్రమించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1954 నుంచి ప్రస్తుత పహాణీల వరకు అన్ని రెవెన్యూ రికార్డుల్లో వీళ్లే హక్కుదారులుగా ఉన్నారు. 2002 జనవరి 25న హక్కుదారులంతా తారస్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి ఏజీపీఏ చేశారు. 2004 అక్టోబరు 20న ఆ ఏజీపీఏని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరికీ విక్రయించలేదని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కలెక్టర్ గా అమోయ్ కుమార్ ప్లాట్ల యజమానుల రికార్డులను పరిశీలించకుండా కంపెనీలకు, పెద్దలకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకున్నారని, రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేయించారని ఈడీకి ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed