కాంగ్రెస్‌పై మోడీ విమర్శనాస్త్రాలు

by S Gopi |
కాంగ్రెస్‌పై మోడీ విమర్శనాస్త్రాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేవలం ఒక కుటుంబం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ తన బలం మొత్తం ఉపయోగిస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని రకాల కుంభకోణాలు జరిగాయని, గడిచిన 10 ఏళ్లలో తమ ప్రభుత్వం వాటిన్నంటిని ఆపేసిందని మోడీ తెలిపారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనే సంకల్పం కాంగ్రెస్‌కు లేదన్నారు. ఆదివారం గుజరాత్‌లోని ఓఖా, బేట్ ద్వారక మధ్య భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్-స్టేడ్ వంతెనతో సహా ద్వారకలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలను ఎక్కుపెట్టారు. దేశాన్ని ఎక్కువకాలం పాలించిన వారికి సామాన్యులకు సౌకర్యాలు కల్పించాలనే సంకల్పం, అంకితభావం లేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రభుత్వాన్ని ఎలా కొనసాగించాలి, స్కామ్‌లను ఎలా దాచాలి అనే ఉంటుంది. దేశ ప్రజల పెద్ద పెద్ద కలలను నెరవేర్చే సామర్థ్యం పార్టీకి లేదని మోడీ అన్నారు. అన్ని స్కామ్‌లకు స్వస్తి పలకాలనే తన ప్రభుత్వ నిబద్ధత వల్లే దేశం పురోగతి సాధిస్తోందని, ఓఖా, బేట్ ద్వారక మధ్య భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన వంటి మౌలిక సదుపాయాల కల్పనకు దారితీసిందని మోడీ పేర్కొన్నారు. ఇదివరకు దేశంలో టెలికాం మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ 2జీ స్కామ్ చేసింది. క్రీడల మౌలిక సదుపాయాలను పటిష్ట పరిచే సమయానికి కామన్వెల్త్ స్కామ్ సృష్టించిందని మోడీ విమర్శలు చేశారు. అలాగే, రక్షణ రంగ మౌలిక సదుపాయాలను పెంచాలన్నప్పుడు హెలికాప్టర్, జలాంతర్గామి స్కామ్ చేసిందన్నారు. కాంగ్రెస్ దేశానికి చెందిన ప్రతి అవసరానికి ద్రోహం చేయగలదు. 2014లో ప్రజలు తనకు అధికారం ఇచ్చినప్పుడు.. నేను దేశాన్ని దోచుకోనివ్వనని మీ అందరికీ వాగ్దానం చేశానని ప్రస్తావించారు. గత పదేళ్లలో త ప్రభుత్వం దేశ ఆర్థికవ్యవస్థను ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద దేశంగా మార్చిందని, దానివల్లే నవ భారతానికి కొత్త చిత్రాన్ని సృష్టిస్తున్నామన్నారు.

ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రుల ప్రారంభం..

ఇదే కార్యక్రమంలో మోడీ.. గత ఆరు ఏడు దశాబ్దాలుగా జరిగిన దానికంటే చాలా రెట్లు వేగంగా తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఇతరుల నుంచి ఆశలు ముగిసిన చోటు నుంచే తమ హామీ ప్రారంభమవుతుందని మోడీ అన్నారు. ఆదివారం పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్, పంజాబ్‌లోని భటిండా, యూపీలోని రాయ్‌బరేలి, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ. 11,500 కోట్ల వ్యయంతో 200 కంటే ఎక్కువ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా రూ. 48,000 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ప్రధాని దేశానికి అంకితం చేశారు. 'స్వాతంత్ర్యం తర్వాత 50 ఏళ్లలో దేశంలో ఒక ఎయిమ్స్ మాత్రమే ఉంది, అది కూడా ఢిల్లీలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ఏడు దశాబ్దాల్లో ఏడు ఎయిమ్స్ మాత్రమే ఆమోదం పొందాయి. అవి కూడా ఎప్పుడూ పూర్తి కాలేదని మోడీ తెలిపారు. కానీ 10 రోజుల్లో ఏడు కొత్త ఎయిమ్స్ ప్రారంభమయ్యాయి లేదా వాటి శంకుస్థాపనలు జరిగాయి. అందుకే తాను గత ఆరేడు దశాబ్దాల్లో జరిగిన దానికంటే చాలా రెట్లు వేగంగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పానని మోడీ వివరించారు.

Advertisement

Next Story