రషీద్, అమృతపాల్ లోక్‌సభకు వెళ్లాలంటే కోర్టు ఆర్డర్ అవసరం

by S Gopi |
రషీద్, అమృతపాల్ లోక్‌సభకు వెళ్లాలంటే కోర్టు ఆర్డర్ అవసరం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన ఇంజనీర్ షేక్ అబ్దుల్ రషీద్, అమృతపాల్ సింగ్‌లు పార్లమెంటుకు వెళ్లే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. వారిద్దరూ జైలు నుంచే ఎన్నికల్లో పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. దీంతో షేక్ అబ్దుల్, అమృత్‌పాల్ లోక్‌సభ వెళ్లడానికి ఉన్న అడ్డంకులు, నిబంధనల గురించి న్యాయ నిపుణులు స్పందించారు. వారిద్దరూ లోక్‌సభకు హాజరు కావాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా భారీ భద్రతతో వారిని తరలిస్తారని జైలు అధికారులు, న్యాయ నిపుణులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి 2,04,142 మెజారిటీతో గెలిచిన రషీద్ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక, పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి 1,97,120 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన అమృత్‌పాల్ జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద జైల్లో ఉన్నారు. వారిద్దరూ జైల్లోనే ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే వీలుందా అనే సందేహాలున్న నేపథ్యంలో.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అందుకు అర్హత ఉందని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి పేర్కొన్నారు. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు కాబట్టి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలని ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed