ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేసిన ఈడీ

by Shamantha N |
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేసిన ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమాన‌తుల్లా ఖాన్‌(MLA Amanatullah Khan)ను ఈడీ అరెస్టు చేసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో సోదాలు చేపట్టిన ఈడీ.. సోదాల త‌ర్వాత ఆయ‌న్ను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నియామకాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకోగానే.. ‘‘నన్ను అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు ఇప్పుడే నా ఇంటికి వచ్చారు’’ అని అమానతుల్లా ఖాన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. “నియంత ఆదేశాలతో ఆయన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ నా ఇంటికి చేరుకుంది. నన్ను, ఆప్ నేతలను వేధించడానికి నియంత ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రజలకు నిజాయితీగా సేవ చేయడం నేరమా? ఈ నియంతృత్వం ఎంతకాలం ఉంటుంది? ?" అని అమానతుల్లా ఖాన్ రాసుకొచ్చారు. సెర్చ్ ఆప‌రేష‌న్‌లో భాగంగా ఖాన్ ఇంటికి వెళ్లిన‌ట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదే కేసులో ఎమ్మెల్యేకు స‌మ‌న్లు ఇచ్చి 13 గంట‌ల పాటు విచారించారు.

Advertisement

Next Story

Most Viewed