ఎదురుపడిన మావోయిస్టులు, పోలీసులు.. భీకర కాల్పుల్లో ఒకరు మృతి

by GSrikanth |
ఎదురుపడిన మావోయిస్టులు, పోలీసులు.. భీకర కాల్పుల్లో ఒకరు మృతి
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బీజాపూర్ జిల్లా కోరంజెడ్-బందెపారా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మరణించాడు. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బందెపారా అటవీ ప్రాంతంలో మాదేడ్ ఏరియా కమిటీ డీవీసీఎం నగేష్, ఏసీఎం బుచ్చన్న, ఏసీఎం విశ్వనాథ్‌తో పాటు మరో 20 మంది మావోయిస్టులు సమావేశమై ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

ఈ క్రమంలో బీజాపూర్ నుంచి డీఆర్జీ, బస్తర్ ఫైటర్, ఎస్టీఎఫ్ బలగాలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి గాలింపు చేపట్టాయి. బందెపారా అటవీ ప్రాంతం వద్దకు చేరుకోగానే పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. కొద్దిసేపు తర్వాత మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవటంతో పోలీస్ బలగాలు ముందుకు వెళ్లి తనిఖీలు చేపట్టాయి. దీంట్లో ఓ మావోయిస్టు మృతదేహం, ఒక ఏకే 47 రైఫిల్ కనిపించాయి. కూంబింగ్ కొనసాగుతున్నట్టు తెలిపిన పోలీస్ అధికారులు బలగాలు వెనక్కి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కాగలవని చెప్పారు.

Advertisement

Next Story