జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే ఎన్నికలు..కసరత్తు ప్రారంభించిన ఈసీ !

by vinod kumar |
జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే ఎన్నికలు..కసరత్తు ప్రారంభించిన ఈసీ !
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. కశ్మీర్‌లో ఎన్నికల గుర్తుల కేటాయింపు కోసం రిజిస్టర్డ్ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని కమిషన్ నిర్ణయించినట్టు భారత ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి తెలిపారు. అలాగే రిజర్వేషన్ల కేటాయింపుపైనా కసరత్తు చేపట్టినట్టు వెల్లడించారు. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ సైతం ఇటీవలే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

చివరిగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి. 2018 జూన్ 19న అప్పటి ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aని రద్దు చేసి, జమ్మూ, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాలు లెఫ్ట్ నెంట్ గవర్నర్ పరిపాలనలోనే ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు కేటాయించిన వాటిని మినహాయించి, కేంద్రపాలిత ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది.

కాగా, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని గతేడాది సుప్రీంకోర్టు సమర్థించింది, ఈ నిబంధన తాత్కాలికమేనని, రద్దు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. 2024 సెప్టెంబర్ 30 నాటికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఏర్పాటైన జమ్మూ కశ్మీర్ శాసనసభకు ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటి సారి కావడం గమనార్హం.

Advertisement

Next Story