Haryana Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు

by Hajipasha |
Haryana Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని అక్టోబరు 5వ తేదీకి మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఈ రాష్ట్రంలో అక్టోబరు 1న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన ఈసీ.. రాష్ట్రంలోని బిష్ణోయి వర్గానికి చెందిన సంఘాల అభ్యర్థన మేరకు ఆ తేదీని మార్చింది. గురు జంభేశ్వర్ జ్ఞాపకార్థం అక్టోబరు 2న అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో బిష్ణోయి వర్గం వారు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా పెద్దసంఖ్యలో బిష్ణోయి వర్గం ప్రజలు హర్యానా నుంచి రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లనున్నారు.

ఒకవేళ అక్టోబరు 1నే హర్యానాలో పోలింగ్ నిర్వహిస్తే ఓటు వేసే అవకాశాన్ని బిష్ణోయి వర్గం ప్రజలు కోల్పోతారని ఈసీకి అఖిల భారత బిష్ణోయి మహాసభ, జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు తెలిపాయి. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. పోలింగ్ తేదీని అక్టోబరు 5కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబరు 8న, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబరు 4న జరుగుతుందని వెల్లడించింది. జమ్మూకశ్మీర్ పోలింగ్ తేదీల్లో ఎలాంటి మార్పులూ లేవని ఈసీ స్పష్టం చేసింది. అక్కడ సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో మూడు విడతల్లో ఓట్ల పండుగ జరుగుతుందని తెలిపింది.

Advertisement

Next Story