120 మిలియన్ల మందిపై యుద్ధం, హింస ఎఫెక్ట్.. ఐక్యరాజ్యసమితి

by vinod kumar |
120 మిలియన్ల మందిపై యుద్ధం, హింస ఎఫెక్ట్.. ఐక్యరాజ్యసమితి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, హింస కారణంగా 120 మిలియన్ల మంది ప్రజలు బలవంతంగా నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ(యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది. ఈ మేరకు ‘ఫ్లాగ్‌ షిప్ గ్లోబల్ ట్రెండ్స్’ రిపోర్ట్ పేరుతో గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. స్థానభ్రంశం చెందిన జనాభా ప్రస్తుత జపాన్‌ పాపులేషన్‌తో సమానమని పేర్కొంది. గతేడాది చివరి నాటికి 117.3 మిలియన్ల మంది ప్రజలు స్థానభ్రంశం చెందగా..ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ఈ సంఖ్య 120 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. ఈ సంఖ్య ఏడాది క్రితం110 మిలియన్లు మాత్రమే ఉండటం గమనార్హం. ప్రజలు సంఘర్షణ, పీడన, హింస ద్వారా బలవంతంగా స్థానభ్రంశం చెందుతున్నారని యూఎన్ఓ హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు.

సూడాన్‌లోని ప్రత్యర్థి మిలిటరీల మధ్య జరిగిన యుద్ధం కారణంగా 2023 చివరి నాటికి 10.8 మిలియన్ల మంది స్థానంభ్రంశం చెందారు. ఇందులో 9 మిలియన్ల మంది ప్రజలు అంతర్గతంగా స్థానభ్రంశం చెందగా.. మిగతా వారు చాద్, ఈజిప్ట్, దక్షిణ సూడాన్‌తో సహా పొరుగు దేశాలకు పారిపోయారు. అంతేగాక గతేడాది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మయన్మార్‌లలో పోరాటాల కారణంగా మిలియన్ల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. ఇక భీకరంగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా గాజా స్ట్రిప్‌లోని జనాభాలో సుమారు 1.7 మిలియన్ల మంది (75 శాతం) స్థానంభ్రంశం చెందారని యూఎన్‌హెచ్‌సీఆర్ అంచనా వేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో గత సంవత్సరం సుమారు 7, 50,000 మంది కొత్తగా స్థానభ్రంశం చెందారని తెలిపింది. 2023 చివరి నాటికి మొత్తం 3.7 మిలియన్ల మందిపై ప్రభావం పడినట్టు తెలిపింది.

సిరియాలో అతిపెద్ధ సంక్షోభం

సిరియా ప్రపంచంలోనే అతిపెద్ద స్థానభ్రంశం చెందిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ13.8 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడం గమనార్హం. స్థానభ్రంశం చెందుతున్న ఘటనల్లో అత్యంత దారుణమైన మానవ విషాదాలు ఉన్నాయని ఫిలిప్పో గ్రాండి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం మరింత ముదరక ముందే బలవంతంగా స్థానభ్రంశం చెందడానికి గల మూల కారణాలను తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed