ED: నన్ను అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు వచ్చారు

by Shamantha N |
ED: నన్ను అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు వచ్చారు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బృందం సోమవారం ఉదయం ఆప్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నియామకాలు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకోగానే.. ‘‘నన్ను అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు ఇప్పుడే నా ఇంటికి వచ్చారు’’ అని అమానతుల్లా ఖాన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. “నియంత ఆదేశాలతో ఆయన చేతిలో కీలుబొమ్మ అయిన ఈడీ నా ఇంటికి చేరుకుంది. నన్ను, ఆప్ నేతలను వేధించడానికి నియంత ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రజలకు నిజాయితీగా సేవ చేయడం నేరమా? ఈ నియంతృత్వం ఎంతకాలం ఉంటుంది? ?" అని అమానతుల్లా ఖాన్ రాసుకొచ్చారు.

భారీగా బందోబస్తు

ఈడీ సోదాలు నిర్వహిస్తుండగా.. ఓఖ్లాలోని అమానతుల్లా ఖాన్‌ నివాసం దగ్గర భారీగా ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించాయి. దీనికి సంబంధించిన ఫొటోను ఆప్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు, ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ ఆప్‌ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే అమానతుల్లాను ఈడీ లక్ష్యంగా చేసుకుందని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ అన్నారు. ఆయన అత్తకు ఇటీవలే క్యాన్సర్ ఆపరేషన్ జరిగిందని.. కావాలనే అవేమీ పట్టనట్లు ఈడీ సోదాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు అని పేర్కొన్నారు. మోడీ నియంతృత్వం, ఈడీ గూండాయిజం కొనసాగుతున్నాయని ఫైర్ అయ్యారు. మరో ఆప్ నేత మనీశ్ సిసోడియా బీజేపీపై ఫైర్ అయ్యారు. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అణచివేయడమే ఈడీ పని అని విమర్శించారు. ఎదురుతిరిగిన వారిని అరెస్టు చేయడమే లక్ష్యమని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed