బ్రేకింగ్.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 10 వరకు ED రిమాండ్

by Mahesh |   ( Updated:2023-10-05 14:52:26.0  )
బ్రేకింగ్.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 10 వరకు ED రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ను ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ దేశ రాజధానిలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం సంజయ్‌ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఇరువర్గాల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు.. సంజయ్ సింగ్ ను ఈ నెల 10 వరకు ఈడీ కస్టడీకి అప్పగించాలని నిర్దేశించింది. సంజయ్‌కు రూ.3 కోట్లు ఇచ్చానంటూ లిక్కర్ స్కాంలో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్‌ అరోరా ఇచ్చిన వాంగ్మూలం రికార్డును ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.

ఈ పేమెంట్‌తో ముడిపడిన డిజిటల్ ప్రూఫ్‌ను కూడా సేకరించామని న్యాయస్థానానికి చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సంజయ్ సింగ్ కస్టడీకి ఆర్డర్స్ ఇచ్చింది. అవమానించేందుకే సంజయ్ సింగ్ ను ఈడీ ఆఫీసర్లు అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు. ఈ కేసులో గతంలో ఎన్నడూ సంజయ్ కు కనీసం సమన్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇక ఈడీ కస్టడీకి తరలిస్తున్న సమయంలో సంజయ్‌ సింగ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలేనన్నారు. ఇలాంటి వాటికి భయపడబోమని.. పోరాటం చేస్తామని చెప్పారు.

Advertisement

Next Story