ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు.. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ

by Hajipasha |   ( Updated:2024-05-09 13:38:28.0  )
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు.. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు జైలా ? బెయిలా ? అనేది శుక్రవారం తేలిపోనుంది. మధ్యంతర బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కీలకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇంకొన్ని గంటల్లో వెలువరించనుంది. ఈనేపథ్యంలో గురువారం రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం సరికాదంటూ సుప్రీంకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ (ఈడీ) డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కేం కాదని అందులో పేర్కొన్నారు. ‘‘ఎన్నికల ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదు. అది చట్టబద్ధమైన హక్కు కూడా కాదు. మాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి కూడా ఇలాంటి వెసులుబాటును కల్పించలేదు’’ అని ఈడీ తమ అఫిడవిట్‌లో ప్రస్తావించింది.

గతంలో కూడా కేజ్రీవాల్ అలాగే చెప్పారు

‘‘ గతంలో మేం సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్‌ ఇలాంటి కారణాలనే చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు ఆయన హాజరుకాలేదు. గత మూడేళ్లలో 123 ఎన్నికలు జరిగాయి. సంవత్సరమంతా ఏదో ఒకచోట.. ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రచారం కోసం బెయిళ్లు మంజూరుచేస్తే ఏ రాజకీయ నేతను కూడా మేం అరెస్టు చేయలేం. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచలేం’’ అని సుప్రీంకోర్టులో ఈడీ వాదించింది. ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు బెయిల్‌‌ను మంజూరుచేయడం అనేది చట్టపరమైన సమానత్వానికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని అఫిడవిట్‌లో ఈడీ పేర్కొంది. ‘‘నేరాలకు పాల్పడే నేతలు ఎన్నికల ముసుగులో విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశంగా మారుతుంది. ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుంది’’ అని కేంద్ర దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది.

సానుకూలంగా ధర్మాసనం వ్యాఖ్యలు

లిక్కర్ స్కాంలో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే.. కేజ్రీవాల్ సీఎం హోదాలో అధికారిక విధులను నిర్వహించకూడదని మంగళవారం రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ వల్లే కేజ్రీవాల్‌కు బెయిల్‌‌ను మంజూరు చేసేందుకు ధర్మాసనం సానుకూలంగా ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. శుక్రవారం వెలువడే తీర్పుతో దీనికి సంబంధించిన ఉత్కంఠకు తెరపడనుంది.

Advertisement

Next Story