ఢిల్లీ, ముంబైలో ఈడీ తనిఖీలు: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో చర్యలు

by samatah |
ఢిల్లీ, ముంబైలో ఈడీ తనిఖీలు: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై. పశ్చిమబెంగాల్‌లోని సుమారు 15 ప్రాంతాల్లో బుధవారం తనిఖీలు చేపట్టింది. యాప్‌కు చెందిన ప్రధాన సూత్రధారులు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌ల సన్నిహితుడు నితీశ్‌ దివాన్‌ను ఈడీ అరెస్టు చేసిన 11రోజుల తర్వాత దాడులు జరగడం గమనార్హం. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేసింది. గతంలో ఇంటర్ పోల్ ఆదేశాల మేరకు చంద్రకర్, రవిలను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని భారత్‌కు తీసుకురావడానికి ఈడీ ప్రయత్నిస్తోంది. యాప్ ద్వారా వచ్చిన అక్రమ నిధులను ఛత్తీస్‌గఢ్‌లోని రాజకీయ నాయకులు, అధికారులకు లంచాలు చెల్లించడానికి ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. అంతేగాక యూఏఈలోని రస్ అల్ ఖైమాలో 2023లో చంద్రకర్ వివాహం జరిగిందని, ఈ ఈవెంట్ కోసం సుమారు రూూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. వీరిద్దరితో పాటు అనేక మందిపై ఈడీ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తంగా రూ.6000కోట్ల మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అంచనా వేస్తోంది. కాగా, ఈ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు సుమారు రూ.508 కోట్లు చెల్లించారని ఈడీ గతంలో ఆరోపించగా..వీటిని ఆయన తోసిపుచ్చారు.

Advertisement

Next Story