Rashmi Shukla: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ డీజీపై బదిలీ వేటు

by Shamantha N |
Rashmi Shukla: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ డీజీపై బదిలీ వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ(Maharashtra Polls) ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరిగింది. డీజీపీ రష్మి శుక్లాపై(Rashmi Shukla) ఎన్నికల సంఘం(EC) బదిలీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. రష్మి శుక్లా స్థానంలో వివేక్‌ ఫన్సాల్కర్‌ తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. మహాయతి కూటమి, మహా వికాస్‌ అఘాడీలపై డీజీపీ రష్మీ శుక్లా (Rashmi Shukla) పక్షపాతం వహిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. గత ప్రభుత్వ హయాంలో నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారని.. నేతలు ఏం చేయబోతున్నారనేది తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు చేరవేశారంటూ శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెను ‘బీజేపీ డీజీపీ’గా పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. ఆమెను తొలగించాలని లేఖలో కోరాయి. దీనిపై ఈసీ స్పందించింది. దీంతో, ఆమెపై బదిలీ వేటు వేసింది.

ముగ్గురు పేర్లు సూచించాలన్న ఈసీ

ఇకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సూచించారు. తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా భావించేలా చూడాలన్నారు. రష్మి శుక్లా స్థానంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డీజీపీ నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులతో కూడిన జాబితాను పంపాలని సీఎస్ ని కోరింది. కాగా.. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఓటింగ్‌ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపై ఈసీ బదిలీ వేటువేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed