ఎన్నికల కోసం పలు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ

by Harish |
ఎన్నికల కోసం పలు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక జనరల్ పరిశీలకులను, భద్రత కోసం పోలీసులు పరిశీలకులను, అలాగే ఐదు రాష్ట్రాలకు ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమించింది. మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న మాజీ సివిల్ సర్వెంట్ల ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరగడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వీరు ఆయా రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే గిఫ్ట్స్, తాయిలాలు, తప్పుడు సమాచారం నియంత్రణపై దృష్టి సారిస్తారు.

బీహార్‌లో ఎన్నికల పరిశీలకులుగా రాజస్థాన్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మంజిత్ సింగ్, 1981 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ వివేక్ దూబేను నియమించారు. వీరు బీహార్‌లో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఉత్తరప్రదేశ్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ వి నాయక్, మాజీ ఐపీఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ను నియమించారు.

మహారాష్టకు మాజీ ఐఏఎస్ అధికారి ధర్మేంద్ర S. గంగ్వార్, 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ NK మిశ్రాను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామ్ మోహన్ మిశ్రా, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ఒడిశాకు మాజీ ఐఏఎస్ యోగేంద్ర త్రిపాఠి, రిటైర్డ్ ఐపీఎస్ రజనీకాంత్ మిశ్రాలు బాధ్యతలు నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్‌కు మాజీ ఐఏఎస్ అలోక్ సిన్హా, రిటైర్డ్ ఐపీఎస్ అనిల్ కుమార్ శర్మను నియమించారు.

వీరితో పాటు డబ్బు పంపిణీని అరికట్టడానికి ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యయ పరిశీలకులను కూడా ఈసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో నీనా నిగమ్, ఉత్తర ప్రదేశ్‌లో రాజేష్ తుతేజా, తమిళనాడులో BR బాలకృష్ణన్, ఒడిశాలో హిమాలినీ కశ్యప్, కర్ణాటకలో బి మురళీ కుమార్‌ ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా బాధ్యతలు నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed