DUSU: డీయూఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఎన్ఎస్‌యూఐ అభ్యర్థి.. పదేళ్ల తర్వాత అధ్యక్ష పీఠం కైవసం

by vinod kumar |
DUSU: డీయూఎస్‌యూ ప్రెసిడెంట్‌గా ఎన్ఎస్‌యూఐ అభ్యర్థి.. పదేళ్ల తర్వాత అధ్యక్ష పీఠం కైవసం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) విజయం సాధించింది. ఆ విద్యార్థి సంఘం అభ్యర్థి రౌనక్ ఖత్రీ (Rounak kathri) ప్రెసిడెంట్‌గా గెలుపొందాడు. ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరి(Rishab Chowdary) పై 1,300 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో విజయం సాధించారు. ఖత్రీకి 20,207 ఓట్లు రాగా, చౌదరికి 18,864 ఓట్లు వచ్చాయి. ఇక, ఉపాధ్యక్షుడిగా ఏబీవీపీకి చెందిన భాను ప్రతాప్ (Bhanu prathap) గెలుపొందగా, అదే సంఘానికి చెందిన మిత్రవింద కర్నావాల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన లోకేష్‌ చౌదరి సంయుక్త కార్యదర్శిగా గెలుపొందారు. దీంతో సుమారు పదేళ్ల తర్వాత డీయూఎస్‌యూ అధ్యక్షుడిగా ఎన్ఎస్‌యూఐ గెలుపొందడం గమనార్హం. అంతకుముందు గత పదేళ్లుగా ఏబీవీపీ డీయూఎస్‌యూ అధ్యక్ష పదవిని కలిగి ఉంది.

కాగా, డీయూఎస్‌యూ ఎన్నికలు సెప్టెంబర్ 27న జరిగాయి. ఎన్నికల ఫలితాలు మరుసటి రోజే ప్రకటించాల్సి ఉండగా. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల పోస్టర్లు, బ్యానర్లు తదితరాల కారణంగా ఢిల్లీలో గందరగోళం చెలరేగింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఓట్ల లెక్కింపుపై నిషేధం విధించింది. తాజాగా ఓట్ల లెక్కింపును నవంబర్ 26లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫలితాలు వెల్లడించగా అధ్యక్ష పీఠాన్ని ఎన్ఎస్‌యూఐ కైవసం చేసుకుంది. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టులకు జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి ఎనిమిది మంది, ఉపాధ్యక్ష పదవికి ఐదుగురు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పదవులకు నలుగురు చొప్పున పోటీ పడ్డారు.

Advertisement

Next Story