Delhi: ఐఏఎస్ కోచింగ్ సెంటర్ భవనం గేటు ద్వంసం చేసిన ఎస్‌యూవీ డ్రైవర్ అరెస్ట్

by S Gopi |
Delhi: ఐఏఎస్ కోచింగ్ సెంటర్ భవనం గేటు ద్వంసం చేసిన ఎస్‌యూవీ డ్రైవర్ అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ముగ్గురు యూపీఎస్‌సీ విద్యార్థుల ప్రాణాలను పొట్టన బెట్టుకున్న ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా సోమవారం కోచింగ్ సెంటర్ ముందు నిలిచిన వరద నీటిలో ఎస్‌యూవీని వేగంగా నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ అయిన నిందితుల్లో ఐదుగురిని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో హాజరు పరచగా, వారికి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌యూవీ వాహనాన్ని నడిపిన డ్రైవర్ అరెస్ట్ తర్వాత నిందితుల సంఖ్య ఏడుగురికి చేరింది. దర్యాప్తుకు సంబంధించి మాట్లాడిన డీసీపీ (సెంట్రల్) ఎం హర్షవర్ధన్ మాట్లాడుతూ.. 'కోచింగ్ సెంటర్ ఉన్న బేస్‌మెంట్ స్థల యజమానులతో సహా మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం. ఎస్‌యూవీ వాహనాన్ని నడిపి భవనం గేటు ధ్వంసం అయ్యేందుకు కారణమైన డ్రైవర్ కూడా వారిలో ఉన్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వర్షపు నీరు బేస్‌మెంట్‌లోకి ఎక్కువగా వెళ్లి వరదనీరు ఎక్కువగా నిలిచేందుకు కారణమయ్యాడని' వివరించారు. దానివల్ల సెల్లార్‌లో ఉండిపోయిన విద్యార్థులు బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి విద్యార్థుల మృతికి కారణమైనందున డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని హర్షవర్ధన్ తెలిపారు. గత శనివారం ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లో ఉన్న రవూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి భారీగా వరదనీరు చేరింది. బేస్‌మెంట్‌లోని లైబ్రరీలో 33 మంది విద్యార్థులు చిక్కుకోగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 మంది కాపాడారు. కానీ, అప్పటికే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు.

Next Story

Most Viewed