ఈ అవకాశాన్ని వదులుకోవద్దు: ఓటర్లకు సీజేఐ చంద్రచూడ్ కీలక విజ్ఞప్తి

by Dishanational2 |
ఈ అవకాశాన్ని వదులుకోవద్దు: ఓటర్లకు సీజేఐ చంద్రచూడ్ కీలక విజ్ఞప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటువేసే అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది పౌరుల ప్రధాన కర్తవ్యం అని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘మై ఓట్ మై వాయిస్’ మిషన్ కోసం సీజేఐ ఓ వీడియో సందేశం పంపారు. ‘భారత్ ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలోని పౌరులుగా మనకు అనేక హక్కులున్నాయి. అలాగే కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఓటు వేయడమే. దీనిని సక్రమంగా నిర్వర్తించాలి’ అని వ్యాఖ్యానించారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని..ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులోకోవద్దని కోరారు. ఐదేళ్ల కోసారి వచ్చే అవకాశం కోసం ఐదు నిమిషాలు వెచ్చించలేరా? అని ప్రశ్నించారు. ప్రతి ఓటరూ గర్వంగా ఓటు వేయాలని తెలిపారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. తాను తొలిసారి ఓటు వేసినప్పుడు దేశ భక్తిలో ఉప్పొంగి పోయానని గుర్తు చేసుకున్నారు. ఈ బాధ్యతను ఎప్పుడూ విస్మరించలేదని తెలిపారు. కాగా, దేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం తొలిదశ పోలింగ్ ముగిసింది.



Next Story

Most Viewed