Donald Trump Master Plan: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్

by Mahesh Kanagandla |
Donald Trump Master Plan: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్
X

దిశ, నేషనల్ బ్యూరో: కొన్ని సంవత్సరాలపాటు సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి(Russia Ukraine War) ఫుల్ స్టాప్ పెడుతానని, తన దగ్గర అద్భుతమైన మాస్టర్ ప్లాన్(Donald Trump Master Plan) ఉన్నదని అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ముందే ఈ ప్లాన్ అమలు మొదలుపెడుతానని ప్రెసిడెంట్ ఎన్నికల్లో(Presidential Elections) చెప్పారు. కమలా హ్యారిస్‌పై అఖండ విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోనుండగా.. ఇంతలోపే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే పని ప్రారంభించినట్టు అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ట్రంప్ క్యాంప్‌లోని ముగ్గురు ఆఫీసర్లు ఆ మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి ముఖ్యమైన వివరాలు తెలిపారు.

ఇదీ ప్లాన్..

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య అంటే.. ఉభయ దేశాల సైనికుల మధ్య 800 మైళ్ల మేర బఫర్ జోన్ ఏర్పాటు చేస్తారు. ఈ బఫర్ జోన్‌లో బ్రిటన్, యూరప్ దేశాల సైనికులను భారీ సంఖ్యలో దింపుతారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య సైనికులు కాల్పులు ఆపేయాల్సి వస్తుంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరాలనే తన కోరికను 20 ఏళ్లు వాయిదా వేసుకోవాలి. రష్యా మరెప్పుడైనా మళ్లీ యుద్ధానికి దిగకుండా ఆ దేశానికి ధీటుగా ఉక్రెయిన్‌ దేశ ఆయుధ సామాగ్రిని పరిపుష్టం చేస్తారు. స్థూలంగా ఇదీ మాస్టర్ ప్లాన్. ఆ బఫర్ జోన్ ఏర్పాటు, అందులోని సైనికుల నిర్వహణ, బాధ్యతలను పూర్తిగా యూరప్ దేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క అమెరికా జవాను కూడా ఉక్రెయిన్‌లో శాంతి భద్రతల కోసం పని చేయరు. బఫర్‌ జోన్‌లో అమెరికా సైనికులు ఉండబోరు. ఇందుకోసం ఆర్థిక సహకారం కూడా అమెరికా నుంచి అందదు. ఈ బాధ్యతలను యూరప్ దేశాలే తీసుకోవాల్సి ఉంటుంది.

రష్యా వైఖరేంటీ?

డొనాల్డ్ ట్రంప్ విజయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూలంగా స్పందించారు. ట్రంప్‌తో వ్యూహాత్మకంగా కలిసి పని చేయడానికి, తద్వార ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలకడానికి ఉమ్మడి పరిష్కారాన్ని చేరుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తి చూపడాన్ని కొనియాడారు. కానీ, ట్రంప్ కామెంట్లతో యూరప్ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని ఆపే క్రమంలో ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు కరిగిపోతుందేమోననే భయాలు నెలకొన్నాయి. యూరోపియన్ డిఫెన్స్ కేటాయింపులు పెంచాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పిలుపు ఇవ్వడం వెనుక కారణం ఇదే. యూరప్ తన భద్రతను తానే చూసుకోవాలనే అభిప్రాయాలు వస్తు్న్నాయి.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ నాటో సభ్యత్వం, తమ భూభాగాన్ని రష్యాకు విడిచిపెట్టబోమనే విషయాల్లో పట్టుదలగా ఉన్నారు. శాంతి పునస్థాపనకు జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో జెలెన్‌స్కీ తన ఆందోళనలు వ్యక్తపరిచారు. ఈ ప్రక్రియలో రష్యాను సంతుష్టపరిచే నిర్ణయాలు తీసుకుంటే అది యూరప్ సెక్యూరిటీకే ముప్పు అని తెలిపారు. అది యూరప్ దేశాలన్నింటికీ ముప్పుగా భావించాలని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed