‘డీఎంకే’ అంటే ‘డ్ర‌గ్ మార్కెటింగ్ క‌జ‌గ‌మ్‌’ అంటున్న బీజేపీ.. ఎందుకు ?

by Hajipasha |
‘డీఎంకే’ అంటే ‘డ్ర‌గ్ మార్కెటింగ్ క‌జ‌గ‌మ్‌’ అంటున్న బీజేపీ.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : డ్ర‌గ్స్ రాకెట్ కేసులో డీఎంకేను బీజేపీ టార్గెట్‌గా చేసుకుంది. డీఎంకే ఇప్పుడు ‘డ్ర‌గ్ మార్కెటింగ్ క‌జగమ్‌’గా మారింద‌ని ఎద్దేవా చేసింది. రూ.2వేల కోట్ల‌కుపైగా విలువైన డ్ర‌గ్స్ రాకెట్‌ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు దొరికిపోయిన జాఫ‌ర్ సాధిక్‌తో ఉన్న సంబంధమేంటో బట్టబయలు చేయాలని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కాషాయ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ మ‌హిళా మోర్చా చీఫ్ వ‌న‌తి శ్రీనివాస‌న్ స్టాలిన్ స‌ర్కారును లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పించారు.నిందితుడితో స్టాలిన్ కుటుంబ స‌భ్యుల‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌నే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయని ఆరోపించారు. జాఫ‌ర్ సాధిక్ నిర్మాత‌గా వ్య‌వ‌హరించిన ఓ సినిమాకు సీఎం ఎంకే స్టాలిన్ కోడ‌లు కిరుతిగ ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించార‌ని వ‌న‌తి శ్రీనివాస‌న్ పేర్కొన్నారు. సీఎం కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌తో జాఫ‌ర్ స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయ‌ని చెప్పారు.

మూడు దేశాలకు జాఫ‌ర్ సాధిక్‌‌ స్మగ్లింగ్‌

కొబ్బరి పొడి, మిక్స్‌ ఫుడ్‌ పౌడర్‌లో కలిపిన సూడోఎఫెడ్రిన్‌.. భారత్ నుంచి తమ దేశాల్లోకి పెద్ద మొత్తాల్లో దొంగచాటుగా రవాణా అవుతోందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు 2023 డిసెంబర్‌లో ఎన్సీబీకి తెలియజేశాయి. ఢిల్లీలో జాఫ‌ర్ సాధిక్‌‌కు చెందిన అవెంటా కంపెనీలో ఫిబ్రవరిలో జరిపిన సోదాల్లో 50 కిలోల సూడోఎఫెడ్రిన్‌ దొరికింది. దీన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా దేశాలకు తరలిస్తున్న రాకెట్‌లో సాధిక్ కీలక సూత్రధారి అని దర్యాప్తులో వెల్లడైంది. సాధిక్ దందా పైరేటెడ్‌ సీడీలతో మొదలై.. కెటమైన్‌ డ్రగ్‌ను అంతర్జాతీయ మార్కెట్‌కు స్మగ్లింగ్‌ చేసే స్థాయికి విస్తరించింది. మూడేళ్లలో 45 దఫాలుగా సుమారు రూ.2 వేల కోట్ల విలువైన 3,500 కిలోల సూడోఎఫెడ్రిన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లోకి జాఫ‌ర్ సాధిక్‌ పంపాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్‌ డ్రగ్‌. దీని సాయంతో తయారు చేసే మెథాంఫెటమైన్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలుకుతుంది! ‘‘పలు రాజకీయ పార్టీలకు నిధులిచ్చినట్టు దొరికిన ఆధారాలపై దర్యాప్తు జరుపుతున్నాం. సాధిక్ నుంచి ముడుపులు అందుకున్న డీఎంకే ముఖ్య నేతకు నోటీసులిచ్చి ప్రశ్నిస్తాం’’ అని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story