Rakesh Pal: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గుండెపోటుతో మృతి

by S Gopi |
Rakesh Pal: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గుండెపోటుతో మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ ఆదివారం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఐసీజీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన ఆయన, అసౌకర్యానికి గురై చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లో చేరినట్టు అధికారులు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ పాల్ మరణించారు. సమాచారం తెలిసిన వెంటనే రాజ్‌నాథ్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని రాకేష్ పాల్‌కు నివాళులు అర్పించారు. అనంతరం, మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన రాకేష్ పాల్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్‌లో ట్వీట్ కూడా చేశారు. ఆయన మరణం పట్ల రక్షణ మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. రాకేష్ పాల్ పార్థివదేహాన్ని ఢిల్లీకి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇండియన్ నావల్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన రాకేష్ పాల్ 1989, జనవరిలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో చేరారు. తన 34 ఏళ్ల కెరీర్‌లో అనేక బాధ్యతలు నిర్వహిచి, 2023 జూలై నుంచి ఐసీజీకి 25వ డైరెక్టర్ జనరల్‌గా చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఐసీజీ భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను, కోట్లాది విలువైన బంగారాన్ని స్వాధీనం చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అతి విశిష్ట సేవా పతకం, ప్రెసిడెంట్ తత్రక్షక్ పతకం, తత్రక్షక్ మెడల్ అందించింది. రాకేష్ పాల్‌కు భార్య దీపా పాల్, ఇద్దరు కుమార్తెలు స్నేహల్, తరుషి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed