‘ఇండియా’ కూటమిలో మరోసారి విభేదాలు: మమతా బెనర్జీని అవకాశవాదిగా అభివర్ణించిన కాంగ్రెస్

by samatah |
‘ఇండియా’ కూటమిలో మరోసారి విభేదాలు: మమతా బెనర్జీని అవకాశవాదిగా అభివర్ణించిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల పంపకం విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగా‌‌ల్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్( టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. సీఎం మమతా బెనర్జీ ఒక అవకాశవాది అని పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. మమత సహాయంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చిచెప్పారు. సొంతంగా ఎలా పోరాడాలో కాంగ్రెస్‌కు తెలుసన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మద్దతులోనే బెంగాల్‌లో టీఎంసీ అధికారంలోకి వచ్చిందనే విషయం మమతా బెనర్జీ గుర్తుంచుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదని స్పష్టం చేశారు. కాగా, సోమవారం కోల్‌కతాలో జరిగిన సమావేశంలో భాగంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఎజెండాను విచ్ఛిన్నం చేసేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే అధిర్ రంజన్ చౌదరి స్పందించారు.

పశ్చిమ బెంగాల్‌లో సీట్ షేరింగ్ సర్దుబాటు అయ్యేనా ?

టీఎంసీ, కాంగ్రెస్ పరస్పర విమర్శల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలుండగా.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని టీఎంసీ పట్టుబడుతోంది. కానీ అందుకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి నిత్యం మమతా బెనర్జీని విమర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా, 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలు, కాంగ్రెస్ 2, బీజేపీ 18 సీట్లలో గెలుపొందాయి.

Advertisement

Next Story