బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం నాశనం: బ్లాక్ పేపర్ రిలీజ్ చేసిన కాంగ్రెస్

by samatah |
బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యం నాశనం: బ్లాక్ పేపర్ రిలీజ్ చేసిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వ శ్వేతపత్రానికి వ్యతిరేకంగా రూపొందించిన బ్లాక్ పేపర్‌ను ఆయన గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ పేపర్ రిలీజ్ చేశాం. ఎందుకంటే వారు పార్లమెంటులో మాట్లాడినప్పుడల్లా విజయాల గురించి మాత్రమే మాట్లాడుతారు. కానీ వైఫల్యాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. అందుకే వారి వైఫల్యాలపై బ్లాక్ పేపర్ విడుదల చేశాం’ అని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతమయ్యే ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఖర్గే..పదేళ్లలో 411 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపునకు తిప్పుకుందని తెలిపారు. దేశంలోని నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారిందని, దానిపై మోడీ ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శించారు. మధ్యప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా కూల్చిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ద్రవ్యోల్భణం పెరిగి పోతుంటే దాని నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.

బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష

మాజీ ప్రధాని నెహ్రూ కాలంలో స్థాపించిన హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), హిందుస్థాన్ మెషీన్ టూల్స్(హెచ్ఎంటీ), భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) సంస్థల గురించి ప్రధాని ప్రస్తావించలేదు. ఇందులో ఎంత మందికి మంచి ఉద్యోగాలు వచ్చాయో చెప్పలేదు’ అని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఏ నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో ఉపాధి తగ్గుముఖం పట్టిందని విమర్శించారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ వంటి బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని చెప్పారు. కాగా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలకు సంబంధించిన మోడీ ప్రభుత్వ వైఫల్యాలను బ్లాక్ పేపర్‌లో పొందు పరిచినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed