ప్రచారానికి డబ్బుల్లేవ్ పోటీ చెయ్యను... కాంగ్రెస్ కు ఎంపీ అభ్యర్థి షాక్

by Prasad Jukanti |   ( Updated:2024-05-06 13:23:00.0  )
ప్రచారానికి డబ్బుల్లేవ్ పోటీ చెయ్యను... కాంగ్రెస్ కు ఎంపీ అభ్యర్థి షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత అభ్యర్థుల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఒడిశాలోని పూరి లోక్ సభ స్థానం నంచి బరిలో ఉన్న ఆ పార్టీ అభ్యర్థి సుచరిత మొహంతీ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు లేఖను రాశారు. అయితే ఇందుకు ఆమె చెప్పిన కారణం షాకింగ్ కు గురి చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధులు పార్టీ నుంచి అందడం లేదని ఈ విషయాన్ని రాష్ట్ర ఏఐసీసీ ఇన్ చార్జి దృష్టికి తీసుకువెళ్తే సొంత డబ్బులే ఖర్చు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేతనం మీద ఆధారపడి జీవించే సాధారణ జర్నలిస్టునని, 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి నా వద్ద ఉన్న డబ్బునంతా ఖర్చు చేశానన్నారు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రజల నుంచి విరాళాలు కోరినా ఫలితం రాలేదని ఇక ప్రచారం నిర్వహించేందుకు తన వద్ద నిధులు లేవన్నారు. పార్టీ సహాయం చేస్తే తప్ప ప్రచారం కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నందునా పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే తన పార్లమెంట్ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలలో కొన్ని చోట్ల గెలిచే అభ్యర్థులకు బదులుగా బలహీన అభ్యర్థులకు టికెట్ కెటాయించారని ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని భావిస్తున్నట్లుగా అధిష్టానానికి లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఒడిశాలో పార్లమెట్ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్ర అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే 6వ తేదీ వరకు గడువు ఉండగా సుచరిత ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. మరో రెండు రోజుల్లో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఇంతలో ఆమె తనకు కేటాయించిన టికెట్ ను రిటర్న్ చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపు ఏకగ్రీవం కాగా, ఈ వ్యవహారం మరువకముందే ఇటీవలే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో తన నామినేషన్ విత్ డ్రా చేసుకుని బీజేపీ గూటికి చేరారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పోటీలోనే లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా పూరి అభ్యర్థి పోటీకి వెనకడుగు వేయడం కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed