ఈ సమయంలో విచారణకు హాజరు కాలేను.. సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ

by GSrikanth |   ( Updated:2023-02-19 05:59:25.0  )
ఈ సమయంలో విచారణకు హాజరు కాలేను.. సీబీఐకి మనీశ్ సిసోడియా లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన దర్యాప్తులో తనను ప్రశ్నించడాన్ని వాయిదా వేయాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐని కోరారు. తన విచారణను ఈనెల (ఫిబ్రవరి) చివరి వారం వరకు వాయిదా వేయాలని సిసోడియా ఆదివారం సీబీఐకి లేఖ రాశారు. ఫిబ్రవరి నెలాఖరులో ఎప్పుడైనా తాను సీబీఐ కార్యాలయానికి వెళ్ళి, విచారణకు సహకరిస్తానని చెప్పారు. తాను ఢిల్లీ రాష్ట్ర ఆర్థిక మంత్రినని, అందువల్ల బడ్జెట్‌ను తయారు చేయడం చాలా ముఖ్యమన్నారు. ఈ మేరకు సిసోడియా మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ను ఖరారు చేస్తున్న నేపథ్యంలో సమయం కావాలని సీబీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. తనను అరెస్టు చేస్తారనే భయం లేదని, ఎలాంటి ప్రశ్నల నుండి కూడా తాను పారిపోవడం లేదని అన్నారు. ఢిల్లీ బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో ఉందని, దానిని సకాలంలో పూర్తి చేయడానికి తాను పగలు, రాత్రి కృషి చేస్తున్నానని చెప్పారు. ఇది ఢిల్లీ ప్రజలకు నష్టాన్ని కలిగించొద్దని పేర్కొన్నారు. బడ్జెట్ పని పట్టాలు తప్పుతుందన్న సిసోడియా.. అందుకే ఫిబ్రవరి నెలాఖరు వరకు సమయం కావాలని సీబీఐని అభ్యర్థించినట్లు తెలిపారు.

కాగా, లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఆదివారం తమ ముందు విచారణకు హాజరుకావాలని మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ నుంచి మరోసారి పిలుపొచ్చిందని సిసోడియా శనివారం ట్వీట్‌ చేసారు. సీబీఐ, ఈడీలను తనపై ఉసిగొల్పారని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో ఆ సంస్థలు తన ఇల్లు, బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేసినా తనకు వ్యతిరేకంగా వారికి ఏమీ దొరకలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే నేడు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ సూచించగా వాయిదా వేయాలంటూ కోరారు. ఇదిలావుండగా, సిసోడియా కోరినట్లుగా విచారణను వాయిదా వేసేందుకు సీబీఐ సానుకూలంగా స్పందించకపోవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బడ్జెట్ సాకు మాత్రమే...

విచారణ వాయిదా వేయాలంటూ సీబీఐకి సిసోడియా లేఖ రాయడంపై ఢిల్లీ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బడ్జెట్ ఒక సాకు మాత్రమే అని సెటైర్లు వేస్తున్నారు. 'స్కామ్‌తో తనకు సంబంధంలేదని నిన్నటి వరకు చెప్పుకునేవాడు, కానీ ఈరోజు అతని బాడీ లాంగ్వేజ్ అతను భయపడుతున్నట్లు సూచిస్తుంది. కఠినమైన ప్రశ్నలు వేస్తారని భయపడుతున్నారా?'అంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి : నాకు తెలుసు నన్ను అరెస్ట్ చేస్తారని... కానీ,... : డిప్యూటీ సీఎం

Advertisement

Next Story

Most Viewed