రికార్డు స్థాయికి చేరిన యమునా నది నీటి మట్టం..

by Vinod kumar |
రికార్డు స్థాయికి చేరిన యమునా నది నీటి మట్టం..
X

న్యూఢిల్లీ: ఢిల్లీలో వరద ముంపు అలాగే కొనసాగుతోంది. 208.66 అడుగుల రికార్డు స్థాయికి చేరిన యమునా నది నీటి మట్టం 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. దీంతో ఢిల్లీలోని సచివాలయం, సుప్రీం కోర్టు, రాజ్‌ఘాట్ సహా పలు కీలక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముకుంద్ పూర్ సమీపంలో వరద నీటిలో 10-13 ఏళ్లలోపు గల ముగ్గురు పిల్లలు మునిగిపోయారు. వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు ఇంకా ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. విద్యా సంస్థలను ఆదివారం వరకు మూసేశారు. పోటీ పరీక్షలను వాయిదా వేశారు. పలు స్మశానవాటికలను కూడా మూసేశారు.

సహాయక చర్యల సందర్భంగా ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ నాయకులు, కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు, లెఫ్టినెంట్ జనరల్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది రాజకీయాలకు, విమర్శలకు సరైన సమయం కాదంటూనే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి సహాయక బృందాలను పంపిస్తున్నామని, ఢిల్లీలో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించామని, 4,346 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 179 జంతువులను కూడా రక్షించామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు.

రానున్న 5 రోజులు వర్షాలు..

శుక్రవారం సాయంత్రానికి యుమునా నది శాంతించడంతో ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారంలో కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. యమునా నది నీటి ప్రవాహంతో రద్దీ ప్రాంతమైన వికాస్ భవన్, ఐటీవో బ్యారేజీ వద్ద భారీ వరద వచ్చి పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అక్కడి డ్రెయిన్ రెగ్యులేటర్ చెడిపోవడంతో సీఎం కేజ్రీవాల్ కోరిక మేరకు ఆర్మీ జవాన్లు సహాయక చర్యలు చేపట్టారు. ఐటీవో బ్యారేజీ వద్ద ఐదు గేట్లను తెరుస్తున్నామని రాష్ట్ర మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. రానున్న 5 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed