ఢిల్లీని క్లీన్‌గా మార్చడమే లక్ష్యం.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

by Harish |
ఢిల్లీని క్లీన్‌గా మార్చడమే లక్ష్యం.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
X

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆర్థిక మంత్రి కైలాశ్ గెహ్లాట్ బుధవారం రూ. 78,800 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో జీ-20 సన్నాహాల కోసం 9 పథకాలను ప్రకటించారు. 2022-23 సంవత్సరానికి ఢిల్లీ బడ్జెట్ రూ.75,800 కోట్లు, అంతకుముందు ఏడాది రూ. 69,000 కోట్లుగా ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా రాజీనామా అనంతరం గెహ్లాట్ ఆర్థిక శాఖ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది.

‘నాకు పెద్దన్న లాంటి సిసోడియా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టివుంటే నేను చాలా సంతోషించేవాడిని. ఈ బడ్జెట్ ప్రజల కోరికలకు, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉంది’ అని బడ్జెట్ స్పీచ్‌లో గెహ్లాట్ చెప్పారు. రానున్న పదేళ్లలో 1,400 కిలోమీటర్ల రోడ్డును మెరుగుపరచడమే కాకుండా ఢిల్లీని రూ. 19,466 కోట్లతో క్లీన్, బ్యూటీఫుల్, మోడ్రన్‌గా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్‌ను అంతికమిస్తున్నామని ఆయన అన్నారు.

2023-24లో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ. 2,034 కోట్లు కేటాయించామని తెలిపారు. వరుసగా తొమ్మిదోసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ‘ఢిల్లీలోని చెత్తను తొలగించేందుకు అవసరమైన ప్రతి సహాయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి (ఎంసీడీ) అందిస్తాం. మురికినీటి నెట్‌వర్క్‌తో ప్రతి కాలనీతో టచ్‌లో ఉంటాం. యమునా నదిని శుద్ధి చేసేందుకు మురుగునీటి శుద్ధి కర్మాగారాల సామర్థ్యాలను పెంచుతాం’ అని మంత్రి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు రూ. 8,241 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

జి-20 సమావేశాల సన్నాహానికి ఈ బడ్జెట్‌లో తొమ్మిది స్కీంలను పొందుపరిచినట్లు గెహ్లాట్ అసెంబ్లీలో చెప్పారు. రోడ్ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయడం, సుందరీకరించడం, 26 ఫ్లైఓవర్‌ల నిర్మాణం, డీఎంఆర్‌సీ సహకారంతో మూడు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌లు, 1,600 ఈ-బస్సులు, బస్ డిపోల విద్యుద్దీకరణ, ప్రపంచ స్థాయి ఐఎస్‌బీటీల నిర్మాణం, ల్యాండ్‌ఫిల్ సైట్‌లను తొలగించడం, యమునా నదిని శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. 26 ఫ్లై ఓవర్ల ప్రాజెక్టులకు గాను 10 ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 11కు యూటీటీఐపీఈసీ అనుమతి కోసం పంపించారు.

Advertisement

Next Story

Most Viewed