సీబీఐ ఎదుట విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

by Javid Pasha |   ( Updated:2023-09-01 15:25:55.0  )
సీబీఐ ఎదుట విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తొలిసారి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ కేంద్ర కార్యాలయంలో కేజ్రీవాల్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం నమోదుకే కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం. సీఎం కేజ్రీవాల్ విచారణ సందర్భంగా ఆప్ పార్టీ నేతలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో సీబీఐ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విచారణకు హాజరయే ముందు సీఎం కేజ్రీవాల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. అంతకుముందు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలోను కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

తనను అవినీతి పరుడంటూ బీజేపీ ఆరోపిస్తోందన్నారు. తాను ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్‌లో కమిషనర్‌గా పని చేశానని.. కావాలనుకుంటే వందల కోట్ల డబ్బు సంపాదించేవాడినని అన్నారు. కానీ తాను ఏనాడూ అలా చేయలేదన్నారు. కేజ్రీవాలే అవినీతి పరుడైతే ఈ ప్రపంచంలో మంచివారంటూ ఎవరూ ఉండరు అని వ్యాఖ్యానించారు. సీబీఐ తనను విచారణకు పిలిచిందని, తాను కచ్చితంగా ఆ విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు. ఎనిమిదేళ్లలో తాను ఢిల్లీలోని పాఠశాలలన్నింటినీ మెరుగుపర్చానని...గుజరాత్‌లో 30 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క స్కూల్‌నైనా బాగుచేశారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చాలా శక్తివంతమైనదని, ఎవరినైనా జైలుకు పంపగలదని అన్నారు. బీజేపీ నేతలకు అధికారం వల్ల వచ్చిన అహంకారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు ఇలా ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

వారి మాట వినకపోతే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రభుత్వం ఆదేశిస్తే సీబీఐ దానిని పాటిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అవతరించే సత్తా భారత్‌కు ఉందని కేజ్రీవాల్‌ అన్నారు. కానీ, నేతల దుష్ట రాజకీయాల వల్ల దేశం వెనుకబడిందని మండిపడ్డారు. భారత్‌ను ప్రపంచంలో నెంబర్‌ 1గా నిలబెట్టడమే తన జీవిత లక్ష్యమని వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణాలివ్వడానికైనా తాను సిద్ధమని కేజ్రీవాల్‌ అన్నారు. అనంతరం రాజ్ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, పార్టీ నేతలతో కలిసి సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

Read more:

సంబరాలు చేసుకుంటున్న ప్రజలు రాబందులు: ఒవైసీ


Advertisement

Next Story

Most Viewed