ఫిబ్రవరి 21న నాలుగు రాష్ట్రాల్లో ‘రైతు ధర్నా’

by Hajipasha |
ఫిబ్రవరి 21న నాలుగు రాష్ట్రాల్లో ‘రైతు ధర్నా’
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో రైతులు ఫిబ్రవరి 21న ధర్నాకు దిగుతారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ శనివారం ప్రకటించారు. ఢిల్లీ బార్డర్‌ వైపుగా వెళ్లనివ్వబోమని చెబుతున్న హర్యానా సర్కారుకు తగిన సమాధానం ఇస్తామని వెల్లడించారు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుంటే ఫిబ్రవరి 26, 27 తేదీల్లో హర్యానా బార్డర్ నుంచి ఢిల్లీ బార్డర్ వరకు హైవేపై ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఢిల్లీ మాకు దూరం కాదు.. రైతులు మాకు దూరం కాదు’’ అని టికాయత్ చెప్పారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా సిసౌలిలో ఉన్న కిసాన్ భవన్ పంచాయతీలో జరిగిన రైతుల సభలో ఆయన మాట్లాడారు. రైతులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్నందుకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని టికాయత్ పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన శనివారం ఐదోరోజు కూడా కంటిన్యూ అయింది. ఇప్పటివరకు రైతులతో కేంద్ర సర్కారు మూడు రౌండ్ల చర్చలు జరిపింది. నాలుగో విడత చర్చలు ఆదివారం సాయంత్రం జరగనున్నాయి. రైతు నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌‌ చర్చలు జరుపనున్నారు. ఇంతకుముందు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో చర్చలు జరిగినప్పటికీ ఆశాజనక ఫలితమేదీ రాలేదు.

Advertisement

Next Story