ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు కూలి ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

by Shamantha N |
ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు కూలి ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో కుండపోతగా వర్షం పడింది. భారీ ఈదురుగాలులకు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పలు కార్లపై టెర్మినల్ పడిపోయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు 5.30 గంటల సమయంలో సమాచారం అందిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. టెర్మినల్ 1 నుండి బయల్దేరే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. చెక్- ఇన్ కౌంటర్లను కూడా మూసివేసినట్లు వివరించారు. ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నామని.. క్షమాపణలు కోరుతున్నామని ఢిల్లీ ఎయిర్ పోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇండిగో, స్పైస్ జెట్ విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.

ఢిల్లీలో వర్షాలు

వారం క్రితం వరకు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వరసుగా రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Next Story