రాహుల్‌కు బాంబే హైకోర్టులో ఊరట..

by Vinod kumar |   ( Updated:2023-06-12 16:41:46.0  )
రాహుల్‌కు బాంబే హైకోర్టులో ఊరట..
X

ముంబై: ప్రధాని మోడీ పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మినహాయింపు ఇచ్చింది. రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ విషయంలో రాహుల్ గాంధీ ‘కమాండర్ ఇన్ థీఫ్’ అని 2018లో చేసిన వ్యాఖ్య ప్రధాని మోడీ పరువుకు నష్టం కలిగించేలా ఉందంటూ బీజేపీ కార్యకర్తగా చెప్పుకుంటున్న మహేశ్ శ్రీశ్రీమల్ కోర్టులో ‘పరువు నష్టం’ కేసు వేశాడు.

స్థానిక కోర్టు తనకు 2021లో జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను జస్టిస్ ఎస్వీ కొత్వాల్ తో కూడిన సింగిల్ బెంచ్ ఆగస్టు 2 వరకు వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం అప్పటి వరకు కొనసాగుతుందని జస్టిస్ కొత్వాల్ తెలిపారు. మోడీని ‘కమాండ్ ఇన్ థీఫ్’ అని రాహుల్ వ్యాఖ్యానించడం ద్వారా బీజేపీ కార్యకర్తలందరినీ, మోడీని అభిమానించే వారినందరినీ దొంగలుగా ముద్ర వేశారని మహేశ్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed