రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం.. ఇక వారి మద్దతు మస్ట్!

by Prasad Jukanti |
రాజ్యసభలో తగ్గిన బీజేపీ బలం.. ఇక వారి మద్దతు మస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభలో బీజేపీ బలం తగ్గింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి అయింది. నామినేటెడ్ సభ్యులైన రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్, మహేశ్ జెఠ్మలానీ పదవీ కాలం గత శనివారంతో పూర్తయింది. దీంతో పెద్దల సభలో బీజేపీకి 86, ఎన్డీయే కూటమికి 101కి సభ్యుల బలం తగ్గింది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజారిటీ మార్కు 113 కాగా ఎన్డీయే బలం కేవలం 101కే పరిమతమైంది. మరో 12 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి 87 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ కు 26, తృణమూల్ కాంగ్రెస్ కు 13, ఆమ్ ఆద్మీకి 10 మంది, డీఎంకేకు 10 మంది సభ్యులు ఉన్నారు. అలాగే ఒడిశాకు చెందిన బీజేడీకి 9, ఏపీలోని వైసీపీకి 11, తెలంగాణలోని బీఆర్ఎస్ కు 4, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు నలుగురు సభ్యులు ఉన్నారు.

అయితే ప్రస్తుతం బీజేడీ కమలం పార్టీని విభేదిస్తున్నది. అన్నాడీఎంకే సైతం బీజేపీకి మద్దతు నిరాకరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీయేతర పార్టీలపై అధికార పక్షం ఆధారపడాల్సి ఉంటుంది. అయితే వైసీపీ, బీఆర్ఎస్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నందునా రాజసభలో ఈక్వేషన్స్ ఆసక్తిగా మారాయి. రాజ్యసభలో ప్రస్తుతం 20 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ నుంచి కే.కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఇటీవలే ఆమోదం తెలిపారు. దీంతో ఈ స్థానానంతో పాటు మిగతా రాష్ట్రాల్లోని ఖాళీలకు ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.

Advertisement

Next Story