భారత్‌కు చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు

by Hajipasha |
భారత్‌కు చేరుకున్న కువైట్ అగ్నిప్రమాద మృతదేహాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కువైట్‌‌లో సంభవించిన భీకర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారత కార్మికుల మృతదేహాలు శుక్రవారం స్వదేశానికి చేరాయి. వారి భౌతిక కాయాలను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురి, ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ముగ్గురు కార్మికుల మృతదేహాలను దించారు. ఈసందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి. విమానాశ్రయంలో భౌతిక కాయాల వద్ద నివాళులర్పించిన వారిలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్రమంత్రి సురేశ్‌ గోపి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ ఉన్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మిగతా 12 మంది భౌతిక కాయాలతో అదే విమానం కొచ్చి నుంచి ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి అంబులెన్సులలో మృతదేహాలను వారివారి స్వగ్రామాలకు తరలించారు. ఉత్తరాదికి చెందిన మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బిహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

కువైట్‌కు వెళ్తానంటే కేంద్రం వెళ్లనివ్వలేదు : కేరళ ఆరోగ్యమంత్రి

అగ్నిప్రమాద బాధితులను సమన్వయం చేసేందుకుగానూ కువైట్‌కు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం తనను అనుమతించలేదని కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆరోపించారు. మరణించిన వారిలో సగాని కన్నా ఎక్కువ మంది కేరళవారే ఉన్నారని, అయినా తనను ఎందుకు వెళ్లనివ్వలేదో అర్థం కాలేదన్నారు. అగ్నిప్రమాదంలో గాయాలపాలై కువైట్‌లో చికిత్స పొందుతున్న 56 మందిలోనూ ఎక్కువ మంది కేరళ వాళ్లే ఉన్నారని వీణా జార్జ్ గుర్తు చేశారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం

కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని విచారణలో గుర్తించారు. ఈ ఘటనలో ఓ కువైట్ జాతీయుడిని, ఒక ప్రవాసీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వారి వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ‘‘నిర్లక్ష్యం కారణంగా ఇతరులను చంపారు’’ అనే అభియోగాన్ని ఆ ఇద్దరు నిందితులపై మోపారు.

Advertisement

Next Story