మణిపూర్‌‌లో దారుణం.. తిరుగుబాటుదారుల కాల్పుల్లో CRPF సైనికుడు మృతి

by Harish |
మణిపూర్‌‌లో దారుణం.. తిరుగుబాటుదారుల కాల్పుల్లో CRPF సైనికుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గతంలో అల్లర్లతో అట్టుడికిన మణిపూర్‌‌‌లో ఇప్పుడు పరిస్థితులు శాంతించాయని అనుకుంటున్న తరుణంలో తాజాగా అక్కడ మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అస్సాం సరిహద్దు జిరిబామ్ జిల్లాలో అనుమానిత తిరుగుబాటుదారులు మెరుపుదాడి చేయడంతో రాష్ట్ర పోలీసులతో కలిసి సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన ఒక సైనికుడు మరణించాడు. పెట్రోలింగ్ వాహనానికి దగ్గరగా నడుస్తున్న సిఆర్‌పీఎఫ్ జవానుపై దగ్గరలోని అటవి ప్రాంతం నుంచి అనుమానాస్పద తిరుగుబాటుదారులు కాల్పులు జరపడంతో అతను మృతి చెందగా, మరికొన్ని బుల్లెట్‌లు వాహనంలోకి చొచ్చుకుపోవడంతో దానిలో ఉన్న ఇద్దరు పోలీసు కమాండోలకు స్వల్పంగా గాయాలయ్యాయి.

ఈ ఆకస్మిక దాడితో అలర్ట్ అయిన భద్రతా దళాలు ఎదురుకాల్పులు చేయడంతో తిరుగుబాటుదారులు దట్టమైన అడవిలో పారిపోయారు. ఈ ఘటనపై ఒక పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ, కాల్పులు జరిపిన నిందితులను పట్టుకోవడానికి అక్కడ కుంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఎక్స్‌లో వ్యాఖ్యానిస్తూ, చనిపోయిన సైనికుడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఇది అనుమానిత కుకీ మిలిటెంట్లు చేసిన దాడి అని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు.

మే 2023లో మెయిటీ-కుకి తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం అట్టుడికి పోగా, రెండు వర్గాలకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. మరికొందరు పొరుగున ఉన్న అస్సాంకు వెళ్లారు. అయితే గత కొద్ది రోజులుగా పరిస్థితులు శాంతించాయని అనుకుంటున్న తరుణంలో తాజాగా కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story