INDIA Bloc: ప్రతిపక్షంలో చీలికలు..? నిరసనలకు టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ దూరం

by Shamantha N |
INDIA Bloc: ప్రతిపక్షంలో చీలికలు..?  నిరసనలకు టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ దూరం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో(INDIA Bloc) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గౌతమ్ అదానీ వ్యవహారంలో చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రతిపక్షాలు(opposition) ఆందోళనకు దిగాయి. అయితే, ఈ నిరసనలకు దీనికి సమాజ్‌వాదీ (Samajwadi Party), తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool) పార్టీలు దూరంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ సహా పలువురు మిత్ర పక్షాలు మాత్రమే నిరసనలు పాల్గొన్నాయి. ‘మోడీ-అదానీ ఒక్కటే’, ‘అదానీ అంశంపై జవాబుదారీతనాన్ని భారత్ కోరుతోంది’ అని ఉన్న ప్లకార్డులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. టీఎంసీ ఎంపీ సమీక్ భట్టాచార్య కాంగ్రెస్ పై మండిపడ్డారు. "ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు కాంగ్రెస్ హాని కలిగిస్తోందని", సభను సజావుగా నిర్వహించేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు. “ ఇండియా కూటమి పరిస్థితిని చూడొచ్చు. కూటమిలో కొన్నిసార్లు టీఎంసీ లేదు. మరికొన్నిసార్లు ఆప్ లేదు. కాంగ్రెస్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆపార్టీని తిరస్కరిస్తారు. హస్తం పార్టీకి ఇప్పుడు ఒకే స్థలం ఉంది. అదే పార్లమెంటు గేట్. " అని భట్టాచార్య కాంగ్రెస్ పై విమర్శలు గుపించారు. మరోవైపు, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని.. సభ లోపల నిరసన తెలియజేయలేమని, అందుకే బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.

సజావుగా సాగుతున్న ఉభయసభలు

శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి పార్లమెంటు (Parliament)లో వాయిదాల పర్వం నెలకొంది. అదానీ వ్యవహారం (Adani Issue), యూపీలోని సంభాల్‌ హింసపై చర్చలు జరిపాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగలేదు. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా జోక్యంతో ఈ గందరగోళ పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. దీంతో మంగళవారం ఉభయ సభలు సజావుగానే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ (Lok Sabha)లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఆ తర్వాత నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశాయి. వాకౌట్ చేసిన తర్వాత పార్లమెంట్‌ ప్రాంగణంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేపట్టారు. అయితే, ఇందులో టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు పాల్గొనలేదు. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సోమవారం జరిగిన విపక్ష కూటమి భేటీకి కూడా టీఎంసీ దూరంగా ఉంది. ఇక, ప్రతిపక్షాల ఆందోళనలతో తరచూ వాయిదా పడుతున్న ఉభయ సభలు మంగళవారం కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story