అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తారా ?.. సీపీఎం మేనిఫెస్టోపై రాజ్‌నాథ్ ఆగ్రహం

by Hajipasha |
అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తారా ?.. సీపీఎం మేనిఫెస్టోపై రాజ్‌నాథ్ ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో : మన దేశానికి చెందిన అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తామని సీపీఐ(ఎం) ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ దారుణమైన వాగ్దానం చేయడం వెనుక ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడం గురించి మాట్లాడటమంటే దేశ భద్రతతో చెలగాటం ఆడటంతో సమానమేనని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఇది దేశాన్ని బలహీనపరిచే పెద్ద కుట్ర అని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమిలోని వామపక్షాలు, కాంగ్రెస్‌ కలిసి దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. 1974లో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వమే భారతదేశపు అణు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. ప్రపంచంలోని 11 అణ్వాయుధ దేశాలలో ఒకటిగా అవతరించేందుకు భారత్ ఎంతో శ్రమించిందన్నారు. ఒకవేళ భారత అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తే.. పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనాలు మన దేశాన్ని బలహీనపరుస్తాయని ఆయన తెలిపారు. కేరళలోని కాసర్‌గోడ్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎంఎల్‌ అశ్వినికి మద్దతుగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story