రేపటి నుంచే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’.. వివరాలివీ

by Hajipasha |
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్‌ నుంచి మొదలుకానుంది. ఈ యాత్రను తౌబాల్ జిల్లాలోని ఖోంగ్జామ్ యుద్ధ స్మారకం వద్ద కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించనున్నారు. అలనాడు బ్రిటీష్ పాలకులతో మణిపూర్ ప్రజల వీరోచిత స్వాతంత్ర్యోద్యమ పోరాటానికి పునాది ఖోంగ్జామ్ యుద్ధ స్మారక ప్రదేశం వద్దే పడింది. రాహుల్ గాంధీ ఆదివారం ఒక్కరోజే మణిపూర్‌లోని నాలుగు జిల్లాల్లో 107 కిలోమీటర్ల మేర యాత్ర చేస్తారు. అక్కడి నుంచి యాత్ర నాగాలాండ్‌లోకి ప్రవేశించనుంది. ‘‘రాహుల్ చేపట్టిన ఈ యాత్ర ఎన్నికల యాత్ర కాదు. ఇదొక సైద్ధాంతిక యాత్ర’’ అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తౌబాల్ జిల్లాలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ మాట్లాడారు.

ఇది అమృత్ కాల్ కాదు.. అన్యాయ్ కాల్ : జైరాం రమేష్

‘‘ప్రధానమంత్రి మోడీ బూటకపు కలలను దేశ ప్రజలకు అమ్ముతున్నారు. అమృత్ కాల్ గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. గత పదేళ్లుగా దేశంలో అన్యాయ్ కాల్ నడుస్తోంది. రాహుల్ గాంధీ సందేశం దేశ ప్రజలకు చేరుతుందని మేం ఆశిస్తున్నాం’’ అని జైరాం రమేష్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక గురించి ఓటర్లకు రాహుల్‌గాంధీ వివరిస్తారని జైరాం రమేష్ అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి సంబంధించి పార్టీ ఇస్తున్న హామీలను ఆయన వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఈ యాత్ర మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లలో 6,713 కి.మీ మేర జరుగుతుంది. 15 రాష్ట్రాలలోని 110 జిల్లాలు, 101 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ స్థానాలను రాహుల్ గాంధీ ఈ యాత్రలో కవర్ చేస్తారు.

Advertisement

Next Story