సొంత అభ్యర్థికే ఓటు వేయవద్దని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్

by Dishanational1 |
సొంత అభ్యర్థికే ఓటు వేయవద్దని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. సహజంగా ఎన్నికలంటే విమర్శలు, ఆరోపణలు, హామీలే కాకుండా ఒకటి అరా విచిత్రమైన సంఘటలు కూడా జరుగుతూనే ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఏ పార్టీ అయినా గెలిచేందుకు తమ అభ్యర్థుల తరపున గట్టిగా ప్రచారం చేస్తాయి. కానీ, రాజస్థాన్‌లోని బన్‌స్వారా-దుంగార్‌పూర్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రజలను విజ్ఞప్తి చేస్తోంది. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజనులు నివశిస్తున్నారు. ఈ సీటుపై అనేక సమాలోచనల తర్వాత అరవింద్ దామెర్‌ను ఖరారు చేసింది. కానీ ఆ తర్వాత భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతివ్వాలని భావించింది. అప్పటికే నామినేషన్ దాఖలుకు ఒకరోజు మాత్రమే గడువు ఉండటంతో అరవింద్ దామెర్‌ను బుజ్జగించి నామినేషన్ ఉపసంహరణకు బతిమాలింది. అయితే, మొదట నామినేషన్ వెనక్కి తీసుకుంటానని చెప్పిన ఆయన గడువు ముగిసే సమయానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశాడు. దాంతో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ కాస్త దామెర్ కారణంగా త్రిముఖ పోటీగా మారింది. దీనివల్ల ఓట్లు చీలి బీజేపీకి లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అరవింద్ దామెర్‌కు ఓటు వేయవద్దని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది.



Next Story

Most Viewed