Indira Gandhi : ఇందిరాగాంధీ వర్ధంతి.. ‘‘నానమ్మ..’’ అంటూ రాహుల్ గాంధీ ఎమోషనల్ సందేశం

by Hajipasha |   ( Updated:2024-10-31 09:43:13.0  )
Indira Gandhi : ఇందిరాగాంధీ వర్ధంతి..  ‘‘నానమ్మ..’’ అంటూ రాహుల్ గాంధీ ఎమోషనల్ సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ ఐక్యత, సమగ్రత కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన త్యాగాన్ని మరువలేమని కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అలుపెరగకుండా ప్రజాసేవ చేసేలా నిత్యం స్ఫూర్తిని పంచే చైతన్యదీపంగా ఇందిరాగాంధీ(Indira Gandhi)ని ఆయన అభివర్ణించారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న శక్తిస్థల్‌ను రాహుల్ గాంధీ(Rahul Gandhi) సందర్శించి నివాళులు అర్పించారు. ‘‘నెహ్రూ గారి ఇందు, ప్రియదర్శిని భయం ఎరుగని వీర వనిత. భారత్ కోసం అంకితభావంతో ఆలోచించినందుకు నేను ఇందిరమ్మను ప్రేమిస్తున్నాను. నానమ్మ.. మీరు దేశం కోసం చేసిన త్యాగం వెలకట్టలేనిది. మీరే మాకు స్ఫూర్తిప్రదాత’’ అని పేర్కొంటూ ఎక్స్‌లో రాహుల్‌ గాంధీ ఒక పోస్ట్ చేశారు.

సంస్కరణల ఘనత ఇందిరకే దక్కుతుంది : ఖర్గే

తుది శ్వాస దాకా దేశం కోసం శ్రమించిన ధీర వనిత ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Kharge) పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా ఇందిరమ్మకు వినమ్రపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశం కోసమే ఇందిర ప్రాణాలను అర్పించారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సైనిక వ్యవస్థను బలోపేతం చేసేలా విప్లవాత్మక సంస్కరణలు చేసిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు.

దేశభక్తికి ప్రతిరూపం ఇందిరమ్మ : ప్రియాంకాగాంధీ

దేశభక్తి భావానికి ప్రతిరూపంగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ అన్నారు. ఇందిరమ్మ జీవితం తనతో పాాటు ఎంతోమందికి కలకాలం స్ఫూర్తిగా నిలిచిపోతుందని చెప్పారు.

Advertisement

Next Story