‘న్యాయం కోసం విరాళం’.. 2 గంటల్లోనే 2 కోట్ల విరాళం.. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు డొనేషన్స్

by Hajipasha |
‘న్యాయం కోసం విరాళం’.. 2 గంటల్లోనే 2 కోట్ల విరాళం..  ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు డొనేషన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో : రాహుల్‌ గాంధీ మణిపూర్ నుంచి ప్రారంభించిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ కోసం కాంగ్రెస్‌ పార్టీ విరాళాల సేకరణను మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమానికి ‘న్యాయం కోసం విరాళం ’ పేరిట శనివారం శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ బలోపేతం కోసం గత నెలలో ‘దేశం కోసం విరాళం ’ పేరుతో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘డొనేట్‌ ఫర్‌ న్యాయ్‌’కు రూ.670, ఆపై విరాళం అందించే వారికి రాహుల్‌ గాంధీ సంతకం చేసిన టీ షర్టును బహుమతిగా అందిస్తారు’’ అని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, సీనియర్‌ నేత అజయ్‌ మాకన్‌ వెల్లడించారు. రూ.67 వేలకు మించి విరాళం సమకూర్చేవారికి ‘న్యాయ్‌ కిట్‌’‌ను అందజేస్తామని తెలిపారు. ఆ కిట్‌లో టీ-షర్టు, బ్యాగు, బ్యాడ్జీ వంటి వస్తువులు ఉంటాయని చెప్పారు. దాతలందరికీ రాహుల్ సంతకంతో కూడిన లేఖ, ధ్రువపత్రం తప్పక అందిస్తామన్నారు. ‘‘దేశం కోసం విరాళం కార్యక్రమానికి ఇప్పటివరకు దాదాపు రూ.20 కోట్లు వచ్చాయి. ‘డొనేట్ ఫర్ న్యాయ్’ ప్రచారాన్ని ప్రారంభించిన రెండు గంటల్లోనే రూ.2 కోట్లు సమకూరాయి. డబ్బు సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కార్యకర్తల్లో ప్రేరణ నింపడమే మా టార్గెట్’’ అని అజయ్‌ మాకన్‌ వివరించారు. కాగా, ఈ నెల 14న మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లాలో ప్రారంభమైన న్యాయ్‌ యాత్ర.. మొత్తం 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబైలో ముగుస్తుంది.

Advertisement

Next Story