కాంగ్రెస్ రాగానే బాంబులు పేలాయ్.. పీఎఫ్ఐ యాక్టివ్ అయింది : ప్రధాని మోడీ

by Hajipasha |
కాంగ్రెస్ రాగానే బాంబులు పేలాయ్.. పీఎఫ్ఐ యాక్టివ్ అయింది : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం ఎక్కగానే ఐటీ హబ్‌ బెంగళూరు బాంబులతో దద్దరిల్లిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ‘‘బాంబు పేలుడుతో బెంగళూరు దద్దరిల్లితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పేలిందని బుకాయించింది. బాంబు పేలలేదు..వాళ్ల మైండు పేలింది.. ఆ పేలుడుకు పాల్పడిన వాళ్లంతా పీఎఫ్ఐ కార్యకర్తలని ఎంక్వైరీలో వెల్లడైంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కర్ణాటకలో అధికారంలో ఉన్న టైంలో పీఎఫ్ఐ వంటి సంస్థలను బ్యాన్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలాంటి సంస్థలకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లు అయిందన్నారు. రాహుల్ గాంధీ లోక్‌సభకు పోటీ చేస్తున్న వయనాడ్‌లోనూ పీఎఫ్‌ఐ యాక్టివ్‌‌గా పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటే.. ప్రభుత్వం నడిపే అవకాశమే దక్కితే దేశ వ్యతిరేక శక్తుల భరతం పట్టడమే పనిగా పెట్టుకుంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తీవ్రవాదులు చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించి.. కన్నీళ్లు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనా మహోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారందరినీ దేశం ఈ ఎన్నికల్లో తిరస్కరించబోతోందని ఆయన చెప్పారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చివరి నిమిషం దాకా అన్ని రకాల ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజే అయోధ్య రామమందిరం నిర్మాణంపై నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని పేర్కొన్నారు.

ఛత్రపతి శివాజీ, కిట్టూరు రాణిని అవమానించారు

కర్ణాటకలోని బెళగావిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన ఆయన.. బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తానుల అరాచకాలపై మౌనం వహిస్తున్నారని చెప్పారు. ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్‌ రాయించిందన్నారు. ‘కాంగ్రెస్‌ యువరాజు నేటికీ ఆ పాపాలను కొనసాగిస్తున్నారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని ఆయన (రాహుల్) ఆరోపించారు. తద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్‌, కిట్టూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను అవమానించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే అటువంటి ప్రకటనలు చేశారు. కానీ, దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తానులు, బాద్‌షాలు చేసిన దౌర్జన్యాలపై మాత్రం ఆయన నోరు మెదపలేదు’ అని మోడీ విమర్శించారు.మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు అణచివేతల గురించి రాహుల్‌ మరచిపోయారన్న మోడీ.. ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి, ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

Advertisement

Next Story