Haryana Polls : ఈసీ స్పందనపై కాంగ్రెస్ భగ్గు.. లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని వార్నింగ్

by Hajipasha |   ( Updated:2024-11-01 13:07:29.0  )
Haryana Polls : ఈసీ స్పందనపై కాంగ్రెస్ భగ్గు.. లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో(Haryana polls) అక్రమాలు జరిగాయంటూ, ఈవీఎంలలో సాంకేతిక లోపాలు చోటు చేసుకున్నాయంటూ కాంగ్రెస్(Congress) చేసిన ఆరోపణలను ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం(EC) తోసిపుచ్చింది. దీనిపై హస్తం పార్టీ శుక్రవారం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈసీ స్పందనను చూసి తాము పెద్దగా ఆశ్చర్యపోలేదని పేర్కొంది. ‘‘మేం ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంది’’ అని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. అయితే తమ ఫిర్యాదుకు బదులిచ్చే క్రమంలో ఈసీ వినియోగించిన పదజాలంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఫిర్యాదు చేసిన రాజకీయ పార్టీని కించపరిచేలా ఈసీ పదజాలాన్ని ప్రయోగించడం సరికాదు. ఇదే ధోరణిని ఈసీ కొనసాగిస్తే.. మేం లీగల్‌గా ప్రొసీడ్ అవుతాం’’ అని హెచ్చరించింది.

‘‘ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి ఎవరు ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అడ్మినిస్ట్రేటివ్, క్వాసీ జ్యుడీషియల్ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందనే విషయాన్ని ఈసీ మర్చిపోయినట్టుంది. క్వాసీ జ్యుడీషియల్ విధులు నిర్వర్తించే క్రమంలో సభ్యత కలిగిన పదాలనే వాడాలి’’ అని హస్తం పార్టీ విమర్శించింది. ఈమేరకు వివరాలతో ఓ లేఖను ఈసీకి కాంగ్రెస్ పార్టీ పంపింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, భూపిందర్ హుడా, అజయ్ మాకెన్, అభిషేక్ సింఘ్వి, ఉదయ్ భాన్, ప్రతాప్ బజ్వా, పవన్ ఖేరా సంతకం చేశారు.

Advertisement

Next Story

Most Viewed