కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల సీజ్‌పై నేడు విచారణ

by Hajipasha |
కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల సీజ్‌పై నేడు విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించాల్సి ఉన్న రూ.105 కోట్ల పన్ను బకాయిల రికవరీకి సిద్ధమైన ఆదాయపు పన్నుశాఖపై కాంగ్రెస్‌ పార్టీ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈక్రమంలోనే మార్చి 8న ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)‌ను హస్తం పార్టీ ఆశ్రయించినా.. రికవరీపై స్టే ఇచ్చేందుకు ట్రిబ్యునల్ నో చెప్పింది. దీంతో ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తాజాగా సోమవారం కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. పిటిషన్‌ను విచారణ కోసం లిస్టింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ తుషార్‌ రావ్‌ ఎదుట కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది వివేక్‌ తన్ఖా వాదనలు వినిపిస్తూ.. రాజకీయ పార్టీ ఖాతాలను స్తంభింప చేయడంతో ఇది అత్యవసరంగా విచారించాల్సిన అంశమని పేర్కొన్నారు. దీనికి జస్టిస్‌ మన్మోహన్‌ అంగీకరించారు. ఇక ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ఇటీవల ఐటీ అధికారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి రూ.65కోట్లు విత్‌డ్రా చేశారని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Advertisement

Next Story