Congress: శివాజీ మహారాజ్‌ను మోడీ అవమానించారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
Congress: శివాజీ మహారాజ్‌ను మోడీ అవమానించారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ శివాజీ మహారాజ్ కి క్షమాపణలు చెప్పడానికి వివిధ కారణాలు ఉండొచ్చని, ఆయన శివాజీ మహారాజ్‌కే కాకుండా మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని సాంఘ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్ సహా ఇతర నాయకులతో కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పై విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం అయ్యిందని, అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ- 'నేను శివాజీ మహారాజ్‌కి క్షమాపణలు చెబుతున్నాను' అన్నారని గుర్తుచేశారు. మోడీ క్షమాపణ చెప్పడానికి వివిధ కారణాలు ఉండవచ్చని, ఈ విగ్రహానికి సంబంధించిన కాంట్రాక్టును ఆర్ఎస్ఎస్ నుండి ఎవరికైనా ఇచ్చి ఉండవచ్చని, బహుశా ఈ కాంట్రాక్టును వేరేవాళ్లకి ఇచ్చి ఉండాల్సిందని క్షమాపణలు చెప్పాడేమోనని ఎద్దేవా చేశారు.

అలాగే విగ్రహం తయారీలో అవినీతి జరిగి ఉండొచ్చని, అందుకే ప్రధాని క్షమాపణలు చెబుతున్నారేమోనని అన్నారు. మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేసారు, కానీ అది అలాగే ఉండేలా జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ శివాజీ మహారాజ్‌ను అవమానించారని, ఆయన శివాజీ మహారాజ్‌కే కాకుండా మహారాష్ట్రలోని ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలోని నలుమూలలా బీజేపీ విద్వేషాన్ని రెచ్చగొడుతోందనేది కొత్త విషయం కాదని, శతాబ్దాల తరబడి ఇలానే చేస్తున్నారని, ఈ తరహా భావజాల యుద్ధం పాతదేనని విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతం ఈ పోరు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉందని, ఇంతకు ముందు ఈ పోరులో శివాజీ మహారాజ్, ఫూలేలు కూడా పాల్గొన్నారని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, షాహూజీ మహరాజ్, ఫూలేజీ, అంబేద్కర్‌జీలను చదివితే వీళ్లందరి భావజాలం, కాంగ్రెస్ భావజాలం ఒకటేనని తెలిసిపోతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story