కాంగ్రెస్ మేనిఫెస్టో పాక్‌లో పనికొస్తుంది: అసోం సీఎం బిస్వ శర్మ వ్యాఖ్యలు

by samatah |
కాంగ్రెస్ మేనిఫెస్టో పాక్‌లో పనికొస్తుంది: అసోం సీఎం బిస్వ శర్మ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ విమర్శలు గుప్పించారు. ఈ మేనిఫెస్టో భారత్‌లో కంటే పొరుగున ఉన్న పాకిస్థాన్ ఎన్నికలకు పనికొస్తుందని ఎద్దేవా చేశారు. ఇది సమాజాన్ని విభజించే లక్ష్యంతో ఉందని ఆరోపించారు. జోర్హాట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బిస్వ శర్మ ప్రసంగించారు. ‘కాంగ్రెస్ మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీయాలను తలపిస్తోంది. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది భారత్‌లో జరిగే ఎన్నికల కోసం కాకుండా పాకిస్థాన్ ఎలక్షన్స్ కోసం ఉద్దేశించిందిగా అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

దేశంలో హిందువులు లేదా ముస్లింలు ఎవరూ ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణను కోరుకోవడం లేదన్నారు. అంతేగాక బాల్య వివాహాలు, బహు భార్యత్వాన్ని కూడా ఎవరూ సమర్థించడం లేదన్నారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా మార్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

బిస్వశర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బిశ్వ శర్మ లాంటి పార్టీ మారిన వ్యక్తులకు లౌకిక, సమ్మిళిత తత్వాన్ని అర్థం చేసుకోలేరని అసోం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రత బోరా అన్నారు. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడటమే తమ మేనిఫెస్టో లక్ష్యమని స్పష్టం చేశారు. బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో అనేక ఏళ్లు పనిచేసినప్పటికీ పార్టీలోని ప్రధాన సూత్రాలను అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. అందుకే ఆయన బీజేపీలోకి వెళ్లారని తెలిపారు. కాగా, కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్రెంటిస్‌షిప్ హక్కు, ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని పెంచేందుకు రాజ్యాంగ సవరణను ఆమోదించడం వంటివి మేనిఫెస్టోలో ఉన్నాయి.

Advertisement

Next Story