మూడో వికెట్ కోల్పోయిన కాంగ్రెస్ !: పోటీ నుంచి తప్పుకున్న ‘పూరి’ అభ్యర్థి సుచరిత

by samatah |
మూడో వికెట్ కోల్పోయిన కాంగ్రెస్ !: పోటీ నుంచి తప్పుకున్న ‘పూరి’ అభ్యర్థి సుచరిత
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌లో పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎంపీ క్యాండిడేట్ తన నామినేషన్ విత్ డ్రా చేసుకుని బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. అయితే ఈ షాక్‌ల నుంచి తేరుకోక ముందే.. తాజాగా ఒడిశాలోని పూరి లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి సుచరిత మొహంతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ప్రచారానికి పార్టీ నుంచి డబ్బులు అందడం లేదని అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. ‘పూరిలో ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి నిధులు రావడం లేదు. కాబట్టి ఫండ్ లేకుండా ప్రచారం చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితి తలెత్తినందుకు ఎంతో బాధపడుతున్నా. నేను ప్రొఫెషనల్ జర్నలిస్ట్‌ని పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. పూరిలో ప్రచారానికి నా దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశాను. ఎన్నికల కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు కూడా ప్రయత్నించాను. కానీ అది విజయంవంతం కాలేదు. ఇక క్యాంపెయిన్‌కు డబ్బుల్లేవు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఒడిశా కాంగ్రెస్ ఇన్‌చార్జి అజోయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా సొంత నిధులతోనే ఎన్నికల్లో పోరాడాలని చెప్పినట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

పూరీ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత మొహంతి కూడా క్రౌడ్-ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చడానికి ప్రయత్నించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఆమె యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్‌, బ్యాంక్ ఖాతాల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అది సక్సెస్ కాలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పూరీ లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల పట్ల సుచరిత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని పార్టీ సీనియర్లను అభ్యర్థించిందని, అయినా పార్టీ అధిష్టానం ఆమెను పట్టించుకోలేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో నాలుగు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సుచరిత తప్పుకున్న పూరీ లోక్ సభ సెగ్మెంట్‌లో ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. ఇక్కడ నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపు(మే 6) చివరి తేదీ. అయితే సుచరిత ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రెండు సీట్లను కోల్పోయిన కాంగ్రెస్ పూరి సీటుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ సెగ్మెంట్‌లో బీజేపీ తరఫున సంబిత్ పాత్ర, బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థిగా అరూప్ పట్నాయక్‌ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Next Story