Biren singh: గత పాపాల ఫలితమే మణిపూర్ సంక్షోభం.. కాంగ్రెస్ విమర్శలకు బీరెన్ సింగ్ కౌంటర్

by Shamantha N |
Biren singh: గత పాపాల ఫలితమే మణిపూర్ సంక్షోభం.. కాంగ్రెస్ విమర్శలకు బీరెన్ సింగ్ కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ హింసాత్మక(Manipur violence) ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాను క్షమాపణ చెప్పిన అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు. హస్తం పార్టీ చేస్తున్న విమర్శలపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్(Biren Singh) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గత పాపాల ఫలితమే మణిపుర్‌ సంక్షోభమని ఆరోపించారు. అప్పటి కేంద్రహోంమంత్రి పి. చిదంబరం బర్మీస్ శరణార్థులను పదే పదే ఆశ్రయం కల్పించడం, మయన్మార్ ఆధారిత మిలిటెంట్లతో ఒప్పందం సహా గత పాపాలే ఈ సంక్షోభానికి కారణమని మండిపడ్డారు. అంతేకాకుండా మణిపూర్‌లో 1992 నుంచి 1997 మధ్య జరిగిన నాగా-కుకీ ఘర్షణలను కూడా గుర్తుచేశారు. ఆ కాలంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నర్సింహరావు, ఐకే గుజ్రాల్ మణిపూర్ ని సందర్శించారా అని ప్రశ్నించారు. మణిపూర్ వాసులకు క్షమాపణలు చెప్పారా అని అడిగారు.

కాంగ్రెస్ పై విమర్శలు

కాగా.. అంతకు ముందు బీరెన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గతంలో చోటుచేసుకున్న ఘటనల్లో చాలా మంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. దానికి నేను చింతిస్తూ.. క్షమాపణలు చెబుతున్నాను. అందరూ కలిసి శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన మూడు-నాలుగు నెలల నుంచి ఉన్న శాంతియుత వాతావరణాన్ని చూస్తుంటే రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. అయితే, మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన వెంటనే కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. "ప్రధానమంత్రి మణిపూర్‌కు వెళ్లి అక్కడ కూడా అదే విషయాన్ని ఎందుకు చెప్పలేరు? అతను 2023 మే 4 నుండి దేశమంతా, ప్రపంచాన్ని చుట్టుముడుతున్నారు. కానీ, ఉద్దేశపూర్వకంగా రాష్ట్రాన్ని సందర్శించకుండా తప్పించుకున్నాడు. మణిపూర్ ప్రజలు ఈ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోలేరు" అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed