కాంగ్రెస్ గెలిస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు : ప్రధాని మోడీ

by Dishanational4 |
కాంగ్రెస్ గెలిస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు దేశ రాజ్యాంగమన్నా.. భారతదేశ గుర్తింపు ఉన్నా ద్వేషమని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను తగ్గించి.. మతం ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని మోడీ పేర్కొన్నారు. మత ఆధారిత రిజర్వేషన్లను రాజ్యాంగం నిషేధించిందని, బీఆర్ అంబేద్కర్ దీన్ని వ్యతిరేకించారని ప్రధాని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కుట్ర

‘‘కాంగ్రెస్‌ పార్టీకి ‘వారసత్వ పన్ను’ను అమలు చేయాలనే రహస్య ఎజెండా కూడా ఉంది. ఆ పార్టీ మీ ఆస్తిని లాక్కోవాలని అనుకుంటోంది’’ అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వారసత్వ సంపదపైనా పన్ను విధించాలని కాంగ్రెస్ భావిస్తోందని చెప్పారు. ‘‘మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని మీ పిల్లలకు ఇవ్వాలని అనుకుంటారు. దీనితో ముడిపడిన భారత కుటుంబ విలువల గురించి కాంగ్రెస్‌కు ఏమాత్రం అవగాహన లేదు’’ అని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.‘‘2004లో ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్.. 2009, 2014 ఎన్నికల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది’’ అని మోడీ చెప్పారు. ‘‘జిందగీ కే సాత్ భీ లూట్, జిందగీ కే బాద్ భీ లూట్’’ అనేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాసంపదను దోపిడీ చేస్తుంటాయని ఆరోపించారు. ‘‘శ్రీరాముడు కల్పిత పాత్ర అని కాంగ్రెస్ పార్టీ వాదించింది.. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించింది’’ అని మోడీ చెప్పారు.

సంపదను లాక్కొని.. ఇతరులకు పంపిణీ చేసే ఆలోచనే లేదు : కాంగ్రెస్

ప్రధాని మోడీ ఆరోపణలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. దేశ ప్రజల సంపదను ఒక వర్గం నుంచి లాక్కొని మరో వర్గానికి పంపిణీ చేసే అంశమేదీ తమ పార్టీ న్యాయ పత్రంలో లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ తరహా అంశాలు కొన్ని ఉన్నాయన్నారు. వారసత్వ పన్నును ప్రవేశపెట్టాలనే ఆలోచనేదీ తమకు లేదన్నారు. రాజీవ్ గాంధీ 1985లోనే ఎస్టేట్ డ్యూటీని రద్దు చేశారని ఆయన గుర్తుచేశారు.



Next Story

Most Viewed