పశ్చిమ బెంగాల్‌పై కాంగ్రెస్ దృష్టి: తగ్గేదే లేదంటున్న టీఎంసీ!

by samatah |
పశ్చిమ బెంగాల్‌పై కాంగ్రెస్ దృష్టి: తగ్గేదే లేదంటున్న టీఎంసీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిలో సీట్ షేరింగ్ విషయంపై పలు రాష్ట్రాల్లో స్పష్టత వచ్చింనందున..ఇక కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో చర్చలు జరుపుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కానీ రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని గతంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జి ప్రకటించారు. అయితే ఈ ఫార్ములాను పాటించాల్సిందేనని టీఎంసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ పార్టీ నేత డెరెక్ ఒబ్రెయిన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మమతా చెప్పిన దాంట్లో ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపారు. అసోంలోని కొన్ని సీట్లు, మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానంలో టీఎంసీ బరిలోకి దిగుతుందని ఇందులో ఎటువంటి మార్పు లేదని వెల్లడించారు. బైనాక్యులర్ పెట్టి చూసినా కాంగ్రెస్ పార్టీకి మరో సీటు కేటాయించే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో యూపీ, ఢిల్లీ, గుజరాత్, గోవాలో సీట్లపై క్లారిటీ వచ్చిన కొద్ది గంటల్లో ఒబ్రెయిన్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు షాక్ తగిలినట్టు అయింది. అయితే దేశంలోనే మూడో అత్యధిక ఎంపీలు(42) ఉండటంతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

5 సీట్లు డిమాండ్ చేస్తున్న హస్తం పార్టీ !

లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా మోడీని గద్దె దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌ను కీలకంగా తీసుకుంది. దీంతో టీఎంసీతో చర్చలకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని.. రాష్ట్రంలో ఐదు సీట్లు కావాలని టీఎంసీకి ఇప్పటికే చెప్పినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనికి బదులుగా టీఎంసీకి అసోంలో రెండు సీట్లు, మేఘాలయాలో ఒక సీటును ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మొదటి నుంచీ కాంగ్రెస్ ఇదే ప్రతిపాదన ఉంచగా అందుకు టీఎంసీ నిరాకరించింది. కానీ ప్రస్తుతం చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయని దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక వేళ పొత్తు ఖరారైతే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని వెల్లడించాయి.

టీఎంసీ వైఖరిపై ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కేవలం టీఎంసీకి మాత్రమే ఉందని ఆ పార్టీ చెబుతోంది. ఒబ్రెయిన్ సైతం ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఎందుకంటే 2019లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంతేగాక ఆ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. అయినప్పటికీ రెండు ఎంపీ సీట్లు ఇస్తామని టీఎంసీ చెబుతోంది. ఇప్పటికీ ఇదే ఫార్ములాతో ఉన్నట్టు ఒబ్రెయిన్ తెలిపారు. దీంతో పశ్చిమబెంగాల్‌లో సీట్ షేరింగ్ విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీలు దీనిపై చర్చలు జరుపుతున్నందున త్వరలోనే స్పష్టత రానుంది. అయితే కాంగ్రెస్ ప్రతిపాదనను టీఎంసీ తిరస్కరిస్తుందా? లేక స్వాగతిస్తుందా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story