‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరు మారింది.. కొత్త పేరు ఇదీ

by Hajipasha |   ( Updated:2024-01-04 12:45:52.0  )
‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరు మారింది.. కొత్త పేరు ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : జనవరి 14న ఈశాన్య భారతంలోని మణిపూర్‌ నుంచి మొదలుకానున్న రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరు మారింది. ఈ యాత్రకు కొత్తగా ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అనే పేరు పెట్టారు. ఈవిషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ వెల్లడించారు. ‘‘భారత్ జోడో యాత్ర అనే పేరు ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయిందని పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నాయకులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఈ యాత్ర పేరు ఒక బ్రాండ్‌గా మారిందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే భారత్ జోడో అనే పదంతోనే యాత్ర పేరు ఉండాలని నిర్ణయించాం’’ అని ఆయన తెలిపారు.

జనవరి 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం

ఈ అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరును ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’‌గా మార్చామన్నారు. ఈ యాత్ర మణిపూర్ రాజధాని ఇంఫాల్‌‌లో జనవరి 14న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుందని జైరాం రమేష్‌ చెప్పారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ 66 రోజుల వ్యవధిలో 6,700 కిలోమీటర్ల యాత్రలో ప్రతిరోజూ రెండుసార్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ యాత్ర మణిపూర్, అరుణాచల్‌‌ప్రదేశ్ సహా మొత్తం 15 రాష్ట్రాలను కవర్ చేస్తుందని పేర్కొన్నారు.

యాత్ర షెడ్యూల్ ఇదీ..

  • మణిపూర్‌లో జనవరి 14న ఒకరోజే రాహుల్ గాంధీ యాత్ర జరుగుతుంది. ఆ రోజు నాలుగు జిల్లాలను ఆయన కవర్ చేస్తారు.
  • అనంతరం యాత్ర నాగాలాండ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ యాత్ర రెండు రోజుల పాటు జరుగుతుంది.
  • తదుపరిగా అసోంలో 8 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.
  • అరుణాచల్‌ప్రదేశ్‌లో 1 రోజు, మేఘాలయలో 1 రోజు రాహుల్ యాత్ర ఉంటుంది.
  • పశ్చిమ బెంగాల్‌లో 5 రోజులు, బీహార్‌లో 4 రోజులు, జార్ఖండ్‌లో 8 రోజులు, ఒడిశాలో 4 రోజుల పాటు యాత్ర జరుగుతుంది.
  • ఛత్తీస్‌గఢ్‌లో 5 రోజులు, ఉత్తరప్రదేశ్‌లో 11 రోజులు, మధ్యప్రదేశ్‌లో వారం రోజులు యాత్ర కొనసాగుతుంది.
  • రాజస్థాన్‌లో 1 రోజు, గుజరాత్‌లో 5 రోజులు, మహారాష్ట్రలో 5 రోజులు యాత్ర జరుగుతుంది.
  • మొత్తం యాత్ర 66 రోజులు పాటు ఉంటుంది. ఈ వ్యవధిలో 110 జిల్లాల్లో 6,713 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
Advertisement

Next Story